8 విమానాశ్రయాల నుండే రాకపోకలు
పగలు విమానాల బంద్
తాజా దాడులపై ట్రంప్ యోచన ?
పురోగతి లేకుండా చేతులు మారుతున్న ముసాయిదాలు
అమెరికా అధికారి వ్యాఖ్యలు
వాషింగ్టన్, టెహ్రాన్ : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు ఆవరిస్తున్నాయా? అంటే పరిస్థితులు, సంకేతాలు అలానే కనిపిస్తున్నాయి. అమెరికా మళ్ళీ దాడులు పునరుద్ధరించవచ్చనే ఆందోళనల నేపథ్యంలో పశ్చిమ ఇరాన్ గగనతలాన్ని ఇరాన్ తాత్కాలికంగా మూసేసింది. ఈ మేరకు ఇరాన్ పౌరవిమాన యాన సంస్థ ప్రకటించింది. కేవలం 8 విమానాశ్రయాలు మాత్రమే కఠినతరమైన ఆంక్షల మధ్య పనిచేస్తున్నాయి. మరోపక్క ఇరాన్, వాషింగ్టన్‌ల మధ్య ఒప్పందం కుదర్చడానికి దౌత్య యత్నాలు కొనసాగుతునే వున్నాయి. ఇదిలావుండగా, ఇరాన్‌పై తాజాగా దాడులు పునరుద్ధరించే విషయంలో అమెరికా కూడా సీరియస్‌గానే ఆలోచిస్తోందని, అమెరికా మిలటరీ ఇందుకు సమాయత్తమవుతోందని వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని విమానాశ్రయాల్లో పౌర విమానాల రాకపోకలను రద్దుచేశారని పౌర విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టెహరాన్‌లోని మెహ్రాబాద్, ఇమామ్ ఖొమేనీ విమాన్రాశయాలతో సహా కేవలం 8 మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ విమాన్రాశయాల్లో కూడా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు విమానాల రాకపోకలను నియంత్రించారు. ప్రతి ఒక్క విమానానికి పౌర విమానయాన సంస్థ నుండి అనుమతి తీసుకోవాల్సి వుంటుందని ఆ ప్రకటన పేర్కొంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నవేళ ఇరాన్ ఈ చర్యలు తీసుకుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పందం తక్షణమే కుదురుతుందన్న సంకేతాలు వెలువడకపోవడంతో ఇరాన్‌పై కొత్తగా దాడులు చేసే ఆలోచనను ట్రంప్ ప్రభుత్వం చేస్తోందని శుక్రవారం యాక్సిస్, సిబిఎస్ న్యూస్ ఒక వార్తా కథనాన్ని వెలువరించాయి. ఆదివారం వాషింగ్టన్‌లోనే వుండేలా ట్రంప్ తనషెడ్యూల్‌ను మార్చుకున్నారని కూడా తెలిపింది. దీంతో మళ్ళీ ఘర్షణలు తప్పకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా సైన్యం సమాయత్తమవుతున్నా తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని సిబిఎస్ తెలిపింది. శుక్రవారం ఉదయం తన సలహాదారులతో ట్రంప్ సమావేశమయ్యారని, ఇరాన్‌కు సంబంధించిన తాజా పరిణామాలను చర్చించారని యాక్సిస్ తెలిపింది.
న్యూజెర్సీలో జరిగే తన కుమారుడు ట్రంప్ జూనియర్ వివాహానికి తాను హాజరు కాకపోవచ్చని అంతకుముందు ట్రంప్ ప్రకటించారు. కొన్ని ప్రభుత్వ వ్యవహారాలు వున్నందున తాను వాషింగ్టన్‌లో వుండాల్సి వుంటుందని చెప్పారు. ఇదిలావుండగా, ఒప్పందం కుదిరేలా చూసేందుకు పాక్ దౌత్య యత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం టెహ్రాన్‌లోనే మకాం వేసిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వివిధ ప క్షాలతో మంతనాలు జరుపుతున్నారు. ఇరాన్ నిర్ణయాక క్రమంలో కీలక పాత్ర పోషించే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ అహ్మద్ వాహిదితో మునీర్ భేటీ అయ్యారు. పెద్దగా పురోగతి అంటూ ఏమీ లేకుండానే ప్రతిరోజూ ముసాయిదాలు అటూ ఇటూ చేతులు మారడం ఆందోళన కలిగిస్తోందంటూ ఈ పరిణామాల గురించి తెలిసినొక అమెరికా అధికారిని ఉటంకిస్తూ యాక్సిస్ వ్యాఖ్యానించింది. ఇరాన్ అణ్వాయుధం కలిగి వుండరాదన్నది మా అభిమతం, కాబట్టి మేం గట్టిగానే దాడి చేశాం, అంతకంటే మాకు ఇంకో అవకాశం లేదు. ఇరాన్ కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తహతహలాడుతునే వుంది, చూద్దాం ఏం జరుగుతుందో! అంటూ శుక్రవారం వైట్‌హౌస్‌లో వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా ఇరాన్‌తో చర్చల వ్యవహారం సాగదీత పట్ల ట్రంప్ చాలా అసహనంగా వున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించాయి.








కామెంట్‌లు (0)