వాషింగ్టన్ : ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అలాగే అమెరికా, భారత్ లు వాణిజ్య ఒప్పందానికి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తనకు చాలా ఇష్టమని,తమ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని, త్వరలో తాము కచ్చితంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అన్నారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలకు సంబంధించిన ప్రశ్నకు స్పందిస్తూ.. భారత్ చాలా ఏళ్లుగా అమెరికా విధానాలను తనకు అనుకూలంగా వినియోగించుకుంటూ, భారీ సుంకాలు విధిస్తోందని అన్నారు. భారత్ తమ కంపెనీలపై భారీ మొత్తంలో సుంకాలు విధించిందని, కానీ తాము ఎటువంటి సుంకాలు విధించలేదని అన్నారు. ఈ వారం ప్రారంభంలో అమెరికా ప్రతినిధి బృందం భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. గురువారం నాటికి మధ్యంతర ద్వైపాక్షిక ఒప్పందంపై నాలుగు రోజుల చర్చలను ముగిసినట్లు భారత వాణిజ్య శాఖ ప్రకటించింది. ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేలా, పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పునరుద్ఘాటించింది. ఈ వాణిజ్య చర్చలు పరస్పర సహకారం, ఆచరణాత్మక దృక్పథంతో సాగాయని తెలిపింది.
ప్రధాని మోడీ నాకు మంచి మిత్రుడు : ట్రంప్
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 12:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)