- అధికారికంగా ప్రకటించిన ఇరాన్
- అమెరికా ప్రతిపాదనపై స్పందించామని వెల్లడి
టెహ్రాన్ : అంతర్జాతీయ రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి నిర్వహణకు గానూ కొత్త సంస్థను ఏర్పాటు చేసినట్లు ఇరాన్ సోమవారం ప్రకటించింది.అమెరికా, ఇజ్రాయిల్ దాడి తరువాత ఆ మార్గం గుండా నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఆ మార్గం గుండా ప్రయాణం చేసే నౌకల నుండి టోల్ వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి తన అధికార ఎక్స్ ఖాతాలో జలసంధిలో నౌకల రాకపోకలను పర్యవేక్షించేందుకు కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పోస్టును పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ (పిజిఎస్‌ఎ)తో పంచుకుంది. రివల్యూషనరీ గార్డ్స్ నావికాదళం కూడా ఈ పోస్టును పంచుకుంది.
యుద్ధాన్ని ముగించడానికి ఉద్దేశించి అమెరికా చేసిన కొత్త ప్రతిపాదనపై తాము స్పందించామని అంతకుముందు ఇరాన్ తెలిపింది. వాషింగ్టన్ డిమాండ్లు అతిగా వున్నాయని ఇరాన్ మీడియా వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య సందేశాలు, పరస్పర మార్పిడులు కొనసాగుతున్నాయని తెలిపింది. తమ ఆందోళనలను అమెరికాకు తెలియచేశామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాగ్చి పత్రికా సమావేశంలో తెలిపారు.
పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా సందేశాల మార్పిడి సాగుతోందని చెప్పారుఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఉత్తర ఇజ్రాయిల్‌లో మిలటరీ లక్ష్యంపై డ్రోన్‌తో దాడి చేసినట్లు హిజ్బుల్లా సోమవారం ప్రకటించింది.
తుపాను ముందు ప్రశాంతత !
‘తుపాను ముందు ప్రశాంతత’ అంటూ ఎఐలో రూపొందించిన ఫోటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌పై వైమానిక దాడులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన పెట్టిన ఈ ఫోటో పెట్టడం గమానార్హం. ఆ ఫొటోలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో యుద్ధనౌకలు ప్రయాణిస్తుండగా, ట్రంప్, ఆయన పక్కన ఒక యూఎస్ నేవీ అడ్మిరల్ నిలబడి ఉన్నట్టు ఉంది. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టోపిని పెట్టుకుని ఉండగా, సముద్రంలో ఉన్న నౌకలపై ఇరాన్ జెండాలు ఉండటం గమనార్హం. దీనికి ‘తుపానకు ముందు ప్రశాంతంగానే ఉంటుంది’ అని ట్రంప్ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలయ్యే అవకాశం వుందనే ఆందోళనలు తలెత్తాయి.








కామెంట్‌లు (0)