test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆడి, గెలిచిన పెద్ది!

04 జూన్, 2026

peddi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 09:27 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

‘రయ్ రయ్ రారా..’ అంటూ థియేటర్లలోకి దూసుకొచ్చిన పెద్ది సినిమా గురువారం థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ను అందుకుంది. గేమ్‌ చేంజర్ తర్వాత రామ్‌ చరణ్‌, దేవర తర్వాత రెండో తెలుగు చిత్రంతో జాన్వీ కపూర్‌ జంటగా, పెద్ద అంచనాలతో బాక్సాఫీస్‌ బరిలో దిగిన ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. పెద్ద హీరోల సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న తరుణంలో, మళ్లీ ఈ సినిమాతో కళకళలాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సినిమా స్క్రిప్టును బుచ్చిబాబు రాయగా, కళింగాంధ్ర యాసలోకి మార్చింది ప్రముఖ కథ, నవల, సినీ రచయిత చింతకింది శ్రీనివాసరావు. శ్రీకాకుళం, విజయనగరం యాసభాషలను తెరపై ఆయన సమర్థంగా నిలిపారు. అది కథకు నిండుగా, పూలదండలా అమరింది. భిన్నమైన నవ్యత్వాన్ని తీసుకొచ్చింది. నటీనటులంతా ఈ జనం భాష సొబగులను, సోయగాలను పలికించారనే చెప్పాలి. గుర్తింపు కోసం ఓ యువకుడు చేసే క్రీడా పోరాటమే ఈ పెద్ది కథ.

​“మళ్లీ పుడతామా ఏంటి!” అనేది పెద్ది చెప్పే లైన్‌. ఏది సాధించాలనుకున్నా, దానికోసం ఎంత కష్టమైనా పడాలి; ఏ స్థాయి త్యాగమైనా చేసేయాలి. ప్రాణం ఉన్నలోపే అది సాధించేయాలి. కాగా, ఈ చిత్రం ద్వారా బుచ్చిబాబు చేసిన మరో సాహసం క్రికెట్‌, కుస్తీ, రన్నింగ్‌ క్రీడల్ని ఎంచుకుని వాటితో కథ రాసుకోవడం. దేశంలో ఆటలకు ప్రోత్సాహం పెరగాలని, కథానాయక పాత్ర సాయంతో క్రీడల పట్ల ఆసక్తి, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మగౌరవం, ఉనికి, త్యాగం, బాధ్యత లాంటి గొప్ప గుణాలను అలవరుచుకోవాలని పిలుపునివ్వడం స్వాగతించదగిన విషయం.
​ఇందులో సందర్భోచితమైన సంభాషణలు ఎన్నో ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఎమోషనల్‌ స్టోరీగా పెద్దిని తెరకెక్కించారు. స్పోర్ట్స్‌ డ్రామా అయినప్పటికీ, ఈ కథలో ఓ ప్రత్యేకత ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాడు. క్రికెట్‌తో తెరపై ఎంట్రీ ఇచ్చి, కుస్తీతో ఆకట్టుకొని, అథ్లెట్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తాడు. మూడు విభిన్నమైన క్రీడల్నీ తీసుకున్న బుచ్చిబాబు, వీటి మధ్యలో ఓ ఎమోషనల్‌ కథను చక్కగా చెప్పారు. రామ్‌ చరణ్‌ నటన, రెహమాన్‌ నేపథ్య సంగీతం ఆద్యంతం ఆకట్టుకునేలానే సాగాయి.

​మూడు ఆటల్లోనూ విభిన్నంగా ….

ఈ సినిమా రామ్‌ చరణ్‌ వన్‌మ్యాన్‌ షోగా చెప్పుకోవచ్చు. క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్‌గా మూడు విభిన్నమైన పాత్రలతో కనిపించిన చరణ్‌, ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా కోసం చరణ్‌ పడిన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అప్పలసూరి పాత్రతో జగపతి బాబు ఒదిగిపోయారు. కుస్తీ గురువు గౌర్నాయుడు పాత్రకు శివరాజ్‌కుమార్‌ న్యాయం చేశారు. ఎప్పుడైతే పెద్ది పాత్ర ఎంట్రీ ఇచ్చి గ్రౌండ్‌లో సిక్సర్‌ కొడతాడో, అప్పటి నుంచీ కథనం ఆసక్తికరంగా సాగడం ప్రారంభిస్తుంది. అచ్చియమ్మగా జాన్వీ కపూర్‌ మాస్‌ ఎంట్రీ బాగానే ఉంది. తల్లి శ్రీదేవిని మించిన అందంతో ఆమె ఈ సినిమాలో కనిపిస్తారు. జగపతి బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఫస్టాఫ్‌ మొత్తం పక్కా కమర్షియల్‌ మీటర్‌లో తీర్చిదిద్దిన బుచ్చిబాబు, సెకండాఫ్‌ని మాత్రం చెప్పాల్సిన పాయింట్‌పైనే ఫోకస్‌ పెట్టాడు. ద్వితీయార్థంలో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్‌ అన్నీ ఆకట్టుకుంటాయి. ఒకవైపు కుస్తీ పోటీలు జరుగుతుండగానే కీలక మలుపు రావడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఢిల్లీ ఎపిసోడ్‌లో ఊరి గుర్తింపు కోసం హీరో తీసుకునే కఠిన నిర్ణయం మాత్రం హృదయాలను కలచివేస్తుంది. క్రీడలకు సంబంధించిన ఎపిసోడ్స్‌ విషయంలో దర్శకుడు చాలా వరకు సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాడు. ప్రీ-క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుంది.
రామ్‌ బుజ్జిగా దివ్యేందుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఏఆర్‌ రెహమాన్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బాగుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

​కథలోకి వెళ్తే…

విజయనగరం, బొబ్బిలి ప్రాంతంలో కొండ కింద ఉండే ఒక ఊరు. ఆ ఊరికి రోడ్డు మార్గం లేదు. ఆ ఊరికి పక్కగా రైలు పట్టాలున్నా స్టేషన్‌ లేదు. పైగా, ఆ ఊరిలో ఉన్న 1,800 మందికి ఏ గుర్తింపూ లేదు. ఎందుకంటే అసలు ఆ ఊరు ఏ జిల్లాలోకీ రాని అనాథ. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని చావులొచ్చినా ఆ జనం ఆ ఊరు వదిలి బయటికి వెళ్లరు. అటు విజయనగరం వాళ్లకు, ఇటు బొబ్బిలి వాళ్లకు వాళ్లంటే చిన్నచూపు. వాళ్లను కేవలం రోజు కూలీలుగా, వెట్టిచాకిరీలకు వాడుతుంటారంతే. ఆ ఊరివాడు పెద్ది (రామ్‌ చరణ్‌). అతను క్రికెట్‌లో నంబర్‌ వన్‌. విజయనగరం, బొబ్బిలి వాళ్లు వేలంపాటలో అతన్ని పాడుకుని తమ జట్లలో ఆటకూలీగా ఆడించుకుంటూ ఉంటారు. అతని క్రికెట్‌ ఆటలో ఒడుపులు చూసి నాయుడు (శివరాజ్‌ కుమార్‌) అనే కుస్తీ గురువు కుస్తీ కూడా నేర్పుతాడు. ఆ కుస్తీతో జాతీయ స్థాయిలో ఆడి, తన ఊరికి గుర్తింపుతో పాటు రైల్వే స్టేషన్‌ కూడా తీసుకురావాలనేది పెద్ది ధ్యేయం. ఆ లక్ష్యాన్ని ఎలా చేరతాడు? ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది? అనేదే తక్కిన కథ.
లెన్త్ ఎక్కువగా తీసి ఆతర్వాత కట్ చేయటంతో కథాగమనంలో కొన్నిచోట్ల కంటిన్యూటీ లేనట్లుగా కనిపించింది. హీరోయిన్ జాన్వీకపూర్ పాత్ర కనిపించిన సందర్భాల్లో కొన్నిచోట్ల ఇదే స్పష్టంగా కనిపించింది. మొత్తంగా పరిశీలిస్తే రామ్ చరణ్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. ఒన్ మేన్ షోగా ఆద్యంతం సినిమా సాగుతుండటం చూసిన వారెవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్