test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి

1 రోజు క్రితం

sports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 12:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపు

ప్రజాశక్తి – విజయనగరం కోట : ప్రతి విద్యార్థి తమకు వస్తున్న అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని విజయనగరం  ఎమ్మెల్యే పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పిలుపునిచ్చారు. ఆదివారం విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో బాక్సింగ్ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు స్వయంగా బాక్సింగ్ గ్లౌజ్ ధరించి పంచ్ కొట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ..  ఈ బాక్సింగ్ క్యాంప్ విజయవంతంగా సాగిందన్నారు. ఎక్కడ ఏ సమ్మర్ క్యాంపులు లేదా ఇతర శిక్షణా శిబిరాలు జరిగినా ప్రతి ఒక్కదానిని రికార్డు రూపంలో భద్రపరుచుకుంటే, అది క్రీడాకారుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శాప్ (SAAP) చైర్మన్ రవినాయుడు ఈ కార్యక్రమ ఏర్పాటుకు ఎంతో సహకరించారని కొనియాడారు. క్రీడలు లేదా ఇతర ఏ కార్యక్రమాల్లోనైనా ఒక జట్టుగా (టీమ్‌గా) కృషి చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చన్నారు. కేవలం వేసవి కాలంలోనే కాకుండా, శీతాకాలంలో కూడా ఇలాంటి వింటర్ క్యాంపులను కొనసాగించాలని ఆమె కోరారు. క్రీడలతో పాటు విద్యార్థులు సాంస్కృతిక రంగాలు, నృత్యం, పాటల పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న పిల్లలకు ఆమె సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

కష్టపడి ఉన్నత స్థితికి చేరాలి: ఎస్సై శిరీష

మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై శిరీష మాట్లాడుతూ.. తాము చదువుకునే రోజుల్లో ఇటువంటి క్రీడా అవకాశాలను అందుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం పిల్లలకు మంచి వసతులు దొరుకుతున్నాయని అన్నారు. విద్యార్థులు తమ జీవితంలో విజయం సాధించే వరకు కష్టపడి ఉన్నత స్థితికి చేరాలని, చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా ఎస్సై శిరీష, ఆమె భర్త కలిసి తమ సొంత ఖర్చులతో రూ. 25 వేల విలువైన బాక్సింగ్ రింగ్ కిట్‌ను విద్యార్థులకు బహూకరించి తమ ఉదారతను చాటుకున్నారు.  ఈ కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్‌లు లైన్ మహేష్, శంకర్, కానిస్టేబుల్ రామకృష్ణతో పాటు విజయనగరం మండల టీడీపీ అధ్యక్షులు గంటా పోలినాయుడు, ఏఎంసీ డిప్యూటీ చైర్మన్ బొబ్బాది చంద్రునాయుడు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పాసి అప్పలనాయుడు, దుప్పాడ టీడీపీ నాయకులు నడుపూరి రాంబాబు, కోన సన్యాసమ్మ, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్