test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెరిగిన బంగారం ధరలు – చోరీల ముప్పు : సిఐ ఎం.మురళీకృష్ణ

20 మే, 2026

Increased gold prices - threat of theft: CI M. Muralikrishna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 05:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి) : ఆలయాలకు వచ్చే యాత్రికులు, పరిశ్రమల కార్మికులు జాగ్రత్త వహించాలనీ, అంతరాష్ట్ర సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేశామని, మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడంతో దొంగలకు ఇవి సులభమైన లక్ష్యాలుగా మారాయని, ఈ నేపథ్యంలో బంగారు దుకాణాల యజమానులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ మీడియాకు తెలిపారు. ఆంధ్ర-తమిళనాడు అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన సూళ్ళూరుపేట, తడ పరిసరాల్లో చోరీల నివారణకు, ప్రజల ఆస్తుల రక్షణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న ముందస్తు భద్రతా చర్యలను వెల్లడించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాల దొంగల ముఠాల కదలికలు ఉండే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా సూళ్ళూరుపేట పరిసరాల్లోని ప్రముఖ ఆలయాలకు వచ్చే యాత్రికులు, మహిళలు తమ బంగారు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే తడ, శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమలకు షిఫ్టుల వారీగా డ్యూటీలకు వెళ్లి వచ్చే కార్మికులు, ఉద్యోగులు రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని బుధవారం పత్రికా ముఖంగా కోరారు.

24 గంటల సీసీటీవీ నిఘా
ప్రతి బంగారు దుకాణంలో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, కనీసం 90 రోజుల ఫుటేజ్ బ్యాకప్ ఉండేలా చూడాలనీ, దుకాణాలకు ఆధునిక అలారం సిస్టమ్స్, సెన్సార్ డోర్లు,ఫైర్ సేఫ్టీ పరికరాలను అమర్చుకోవడంతో పాటు రాత్రి వేళల్లో సమర్థులైన సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి.
పెద్ద మొత్తంలో నగదు లేదా బంగారాన్ని వేరే ప్రాంతాలకు తరలించే సమయంలో ముందస్తుగా స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలి.
బంగారం కొనుగోలు, అమ్మకాల సమయంలో కస్టమర్ల పూర్తి వివరాలు,గుర్తింపు కార్డులు నమోదు చేయాలి.
షాపు సిబ్బంది ఐడీ ప్రూఫ్‌లను కూడా పక్కాగా భద్రపరచాలి.
పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల వ్యాపారులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా ఆన్‌లైన్ లావాదేవీలను నమ్మకూడదని స్పష్టం చేశారు.
సరిహద్దు దాటి వచ్చే అంతరాష్ట్ర ముఠాల కదలికలపై నిఘా ఉంచేందుకు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశామని సీఐ తెలిపారు.
వ్యాపారస్తులు, ప్రజలు తమ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు గమనించినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సీఐ ఎం.మురళీకృష్ణ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్