test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహా ‘దారి’ద్రయం.. రోడ్డుపైనే మురుగు ప్రవాహం!

1 రోజు క్రితం

drinage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 11:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నాలుగు నెలలైనా పూర్తికాని కాలువల నిర్మాణం..

  • మక్కువ మండల కేంద్రంలో ప్రజల అవస్థలు

ప్రజాశక్తి-మక్కువ(మన్యం) : మక్కువ మండల కేంద్రం మరియు మేజర్ పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారి దుస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. రహదారి విస్తరణ పనులు చేపడితే మురుగు నీటి సమస్య తొలగిపోయి ప్రయాణం హాయిగా సాగుతుందని ఆశించిన స్థానికులకు నిరాశే మిగిలింది. పనులు ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రధాన రహదారి అంతా మురుగునీటితో చెరువును తలపిస్తోంది. కాలనీల నుంచి వచ్చే మురుగునీరంతా కాలువలు లేకపోవడంతో నేరుగా ప్రధాన రహదారిపైనే ప్రవహిస్తోంది. దీనివల్ల రోడ్డు మొత్తం బురదమయంగా మారి తీవ్ర దుర్వాసన వస్తోంది. ఈ దారి గుండా నిత్యం మండల కేంద్రానికి వచ్చిపోయే ప్రజలు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ బురదలో జారిపడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రంలోని మద్యం దుకాణాల సమీపంలో మురుగునీరంతా భారీగా చేరి పెద్ద చెరువులా తయారైంది. నిల్వ ఉన్న ఈ నీటి వల్ల దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని, తద్వారా మలేరియా, డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిలిచిపోయిన కాలువల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రహదారిపై నిల్వ ఉన్న మురుగునీటిని వెంటనే తొలగించి, రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

drinage

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్