test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెంచిన పెట్రోల్ ధరలను రద్దు చేయాలంటూ …

15 మే, 2026

cpm protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 15, 2026, 12:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గేంత వరకు దేశమంతా సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీ నాథ్ అన్నారు. శుక్రవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న పెట్రోల్ బంకు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెట్రోల్ బంకు వద్ద పెద్దఎత్తున ప్రజలతో కలిసి నినాదాలతో నిరసన తెలుపుతూ రిక్షా బండికి మోటార్ సైకిల్ ను కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీ నాథ్ మాట్లాడుతూ …. కేంద్ర ఎన్డిఎ ప్రభుత్వం పెట్రోల్ పై 3.30పై, డీజిల్ పై 3.14పై పెంచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ లీటరు 112.50పై, డీజిల్ రూ.101 చేరిందని తెలిపారు. దీనివలన దేశంలో ఉన్న నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరిగిపోతాయన్నారు. రైతాంగం దెబ్బతింటుందని, రవాణా రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముందు ఒక్క నయాపైసా పెట్రోల్, డీజిల్ పై పెంచబోమని మోడీ, బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం అయిపోగానే ధరలు పెంచి ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకుని మోడీ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతుందన్నారు. ధరల పెంపు ఈ దశలో జరిగింది కాదనీ, నిన్న, మొన్న హైదరాబాద్ లో పొదుపు చేయాలని మాట్లాడటం వెనుక అంతర్యం ఈ ధరలు పెంచేందుకు ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం కోసమేనని అన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై కేంద్రం 21/- టాక్స్, రాష్ట్ర టాక్స్ 25/- వసూళ్ళు చేస్తుందన్నారు. రూ.45-46 పెట్రోల్, డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూళ్ళు చేస్తున్నాయన్నారు. ఈ పన్నులు తగ్గించుకోకుండా ప్రజల జేబులు కొట్టి ప్రభుత్వ ఖజానా నింపుకుంటుందన్నారు. 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికే రూ.30 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ఆ డబ్బు ఖర్చు చేయాలని కోరారు. ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బు ఖర్చు చేయకుండా ప్రజలపై భారం ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నించారు. ట్రంప్, అమెరికాకు మోడీ లొంగిపోయారని విమర్శించారు. రష్యా నుండి చౌకగా ఆయిల్ వస్తుంటే కొనుగోలు ఆపేశారని, ఇరాన్ దగ్గర చౌకగా ఆయిల్ వస్తుంటే అమెరికాకు మద్దతు తెలుపుతారు అని ధ్వజమెత్తారు. అమెరికాకు లొంగిపోయి దాని భారాన్ని ప్రజలపై వేస్తున్నారని అన్నారు. ఇదే బిజెపి దేశభక్తి. వారి లొంగుబాటు భారం ప్రజలపై వేస్తున్నారు అని దుయ్యబట్టారు. ఇప్పటికే అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, వారు మాత్రం కోట్ల రూపాయలను ఖర్చులు చేస్తూ ప్రజలకు నీతి సూత్రాలు చెబుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీలు ఎన్డిఎ లో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా నోరువిప్పి రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడాలన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు రద్దు చేయాలని కోరారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గేంత వరకు దేశమంతా సిపిఎం పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, జిల్లా నాయకులు ఎన్.సి.హెచ్ శ్రీనివాస్, కోట కళ్యాణ్, సుప్రజ, కమల నగర కార్యదర్శులు సత్యబాబు, బి.రమణారావు, పి.కృష్ణ, నేతలు కే.దుర్గారావు, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్