సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు
మృతుడు పంచాడ కన్నయ్య కుటుంబానికి ₹10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
సిఐటియు పోరాటంతో భవన యజమాని నుండి ₹7.25 లక్షల చెక్కు అందజేత
ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్రంలో ప్రమాదవశాత్తూ చనిపోతున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు డిమాండ్ చేశారు.
విజయవాడ భాను నగర్ 3వ లైన్ లో లిఫ్ట్ ముఠా పని చేస్తూ, భవనంపై నుండి ప్రమాదవశాత్తూ పడి మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు పంచాడ కన్నయ్య కుటుంబానికి సిఐటియు నేతృత్వంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అండగా నిలిచింది. మధురానగర్ ప్రాంతంలో నివాసముండే కన్నయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద ఎన్.టి.ఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన భవన యజమాని రూ. 7 లక్షల ఆర్థిక సహాయం, మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 25 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు శనివారం యూనియన్ నేతల సమక్షంలో భవన యజమాని అందించిన రూ. 7.25 లక్షల చెక్కులను సి.హెచ్. బాబురావు చేతుల మీదుగా కన్నయ్య భార్య, కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా సి.హెచ్. బాబురావు మాట్లాడుతూ.. “ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులు చనిపోతే సంక్షేమ బోర్డు ద్వారా రూ. 10 లక్షల నష్టపరిహారం పెంచి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. వేల కోట్ల రూపాయల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ప్రభుత్వం తన సొంత సొమ్ములాగా ఇతర కార్యక్రమాలకు దారి మళ్లించింది. సంక్షేమ బోర్డు ద్వారా కేవలం 4 పథకాలకు మాత్రమే నిధులు ఇస్తామని జీవో జారీ చేయడం దురదృష్టకరం” అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ప్రమాదాల్లో పిట్టల్లా రాలిపోతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబురావు గర్హించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కన్నయ్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, సంక్షేమ బోర్డు ద్వారా కొత్త కార్డుల జారీ, రెన్యువల్స్ పై పెట్టిన కఠిన నిబంధనలను లేబర్ అధికారులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఎన్.టి.ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పారావు, సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి బి.గోవిందు, సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి యం.బాబురావు, ఉపాధ్యక్షులు బొబ్బిలి శ్రీను, ఐద్వా నగర కమిటీ సభ్యురాలు ఎస్.కె.ఆశా, యూనియన్ కమిటీ సభ్యులు పెంటయ్య, కె.సత్యం, కె.పాపనాయుడు, శ్రీను, కనకరాజు, రామకృష్ణ, నరసింహారావు, కె.వెంకట్ మరియు కార్మికుడి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)