ప్రతిపక్షాలపై దాడులకు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న బిజెపి
అవినీతిపరులతో నిండిపోతున్న బిజెపి కి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిక
ప్రజాశక్తి కాకినాడ: కేరళం మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ నివాసాలపై కేంద్ర ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) దాడులకు నిరసనగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జి, నగర కమిటీ సభ్యుడు కె. సత్తిరాజు లు మాట్లాడుతూ బిజెపి వాషింగ్ మెషిన్ రాజకీయాలు మానుకోవాలని దుయ్యబట్టారు. బిజెపి అవినీతి, కుంభకోణాల బండారాన్ని సిపిఎం బయట పెడుతుందని హెచ్చరించారు. మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ళ కాలంలో ఇ.డి., సిబిఐ, ఎన్.ఐ.ఎ. వంటి రాజ్యాంగ వ్యవస్థలను ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు, లొంగదీసు కోవడానికి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు అవినీతిపరులు, బిజెపి లో చేరగానే సచ్ఛీలురుగా మారిపోతారా అని ప్రశ్నించారు. బిజెపి ఆగడాలను ఈదేశ ప్రజలు సాగనివ్వరని, వారికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని, మీడియా గొంతు నొక్కడమే బిజెపి విధానంగా ఉందన్నారు. బిజెపి రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా, నిరంకుశంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిజెపి అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, దుంపల ప్రసాద్ లతో పాటు చంద్రమళ్ళ పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, ఎం. హరనాథ్, కె. వీరబాబు, అనపర్తి ఏడుకొండలు,సిహెచ్. సతీష్ ,కె. చిట్టిబాబు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)