ప్రజాశక్తి-అచ్యుతాపురం: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొండకర్ల గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ, అచ్యుతాపురం కన్వీనర్ ఆర్. రాము మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత పది రోజుల్లోనే మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఇటీవల పెట్రోల్‌పై లీటరుకు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచడంతో.. గత పది రోజుల్లోనే లీటర్ పెట్రోల్ రూ. 4.77, డీజిల్ రూ. 4.81 మేర పెరిగాయని వారు పేర్కొన్నారు. ఈ పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. చమురు సంస్థల ఒత్తిడితో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు కనీసం రూ. 15 వరకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చమురు కొరత లేదని, ధరలు పెరగవని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. నేడు వరుసగా ధరలు పెంచడం ప్రజలను మోసగించడమే. ఒక్కసారిగా భారీగా పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందనే నెపంతో, ఇలా విడతల వారీగా పెంచుతూ ప్రజలను వంచిస్తున్నారని అన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసరాలతో పాటు అన్ని రకాల సరుకుల ధరలు మరింత ప్రియమవుతాయని వారు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న పన్నులను తగ్గించి, ప్రజలపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, బుజ్జి, వంశీ, నాగప్పరావు, సంజీవ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి: సిపిఎం
24 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 24, 2026, 01:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)