ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : స్ర్తీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటికీ … అటు పురుషులకు, ఇటు మహిళలకు అవస్థలు తప్పడం లేదు. అనంతపురం కళ్యాణదుర్గం రాయదుర్గం డిపోలకు చెందిన బస్సుల్లో రద్దీ అసాధారణంగా పెరిగింది. డబ్బులు ఇచ్చి టికెట్ కొనే పురుషులు కూడా కనీసం నిలబడటానికి చోటు లేక, గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. “డబ్బులు కట్టినా గౌరవంగా ప్రయాణం చేసే పరిస్థితి లేకపోతే ఎలా ?” అంటూ … ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. టికెట్ కొన్నా చోటు దొరకడం లేదంటూ పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు … మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి బస్సులు స్టాపు కు రావడం లేదు.. బస్సులను పాయింట్లలో ఆపకుండా దూరంగా ఆపుతున్నారని చెబుతున్నారు. ఉచితం కంటే సమయానికి బస్సు వస్తేనే తమకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. ప్రతిరోజూ విధులకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట్ మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు కిక్కిరిసి ఉండటం వల్ల ఆఫీసులకు సరైన సమయానికి చేరుకోలేకపోతున్నామని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “మాకు ఉచిత ప్రయాణం అవసరం లేదు, మేము టికెట్ కొనే స్థోమత కలిగి ఉన్నాము. మాకు కావలసింది ప్రశాంతమైన ప్రయాణం, సమయపాలన” అని పలువురు మహిళా ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఏ పథకమైనా ప్రజలకు అసౌకర్యం కలిగించినప్పుడు దాని అసలు ఉద్దేశం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మహిళలు, పురుషులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ పలువురు కోరుతున్నారు.
ఆశయం బాగున్నా.. ఆచరణలో సవాళ్లు ..!
01 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 01, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)