ప్రజాశక్తి-అచ్యుతాపురం : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అచ్యుతాపురం ఎస్ఈజెడలో బైక్‌కు తాడు కట్టి లాగుతూ ఒక వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అనేది దేశవ్యాప్తంగా ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారిందని అన్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల కేవలం వాహనదారులే కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఆ ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరలు పెరిగినప్పుడు రవాణా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని, దీనివల్ల నిత్యం అవసరమయ్యే కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా సామాన్య ప్రజల నెలవారీ బడ్జెట్ పూర్తిగా అస్తవ్యస్తమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, పంపు సెట్ల కోసం డీజిల్ వాడకం తప్పనిసరి కావడం వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులపై అదనపు భారం పడుతోందని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సు ఛార్జీలు, ఆటో ధరలు పెరగడం వల్ల సామాన్యుడి ప్రయాణం భారంగా మారుతోందని, వస్తువుల ఉత్పత్తి, పంపిణీ ఖర్చులు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టాలని రాము డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 50 డాలర్ల (పౌండ్లు) కు పడిపోయినప్పుడు కూడా ధరలు తగ్గించకుండా, సామాన్యులపై భారం మోపి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సామాన్యుడి జీవితంలో వాహనాలు, ఇంధనం అనేవి నిత్యవసరాలుగా మారడంతో, "ఎంత ధర పెంచినా ప్రజలు కొంటారులే" అనే భావంతో ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. మన రాష్ట్రంలో దొరికే చమురు, గ్యాస్ నిక్షేపాలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతూ, ప్రజలను మాత్రం పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పడం ప్రభుత్వాల సిగ్గుచేటన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లాలం నర్సింగరావు, శ్రీను, సత్యం, రాము, రాజు, వాసు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై పెనుభారం మోపుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి: సిఐటియు
18 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 18, 2026, 11:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)