వెలిగొండ అనే గ్రామంలో ఆదిత్య అనే బాలుడు ఉన్నాడు. అతను ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతనికి చదువు, ఆటలు అంటే బాగా ఇష్టం. కష్టపడి చదువుతూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు. కబడ్డీ ఆట అంటే ఇష్టం. తోటి పిల్లలతో కలిసి టీమ్ లీడర్ గా గైడ్ చేస్తూ చురుకుగా ఉండేవాడు. ఆదిత్య ప్రతిభ చూసి టీచర్లు, తల్లిదండ్రులు అందరూ అతన్ని మెచ్చుకునేవారు.
ఒకరోజు స్కూల్ ముగిసిన తర్వాత ఆదిత్య తన స్నేహితుడు వినయ్‌తో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఓ పెద్ద చెట్టు కింద కొంతమంది పెద్ద పిల్లలు గుంపుగా కూర్చొని ఉన్నారు. వాళ్లలో ఒక విద్యార్థి, ‘ఇటు రా వినయ్! ఇది తీసుకుంటే చాలా సరదాగా, మత్తుగా ఉంటుంది. టెన్షన్ అంతా పోతుంది’ అంటూ చిన్న ప్యాకెట్ చూపించాడు. వినయ్ ఆసక్తిగా దాని వైపు చూడసాగాడు.
‘ఏమిటది?’ అని అడిగాడు.
‘ఏమీకాదు! ఒక్కసారి ప్రయత్నించి చూడు. అందరూ వాడుతున్నారు’ అని ఆ గుంపులో మరో విద్యార్థి చెప్పారు. వినయ్ వాళ్ల వైపు వెళ్లడానికి, నడవకుండా ఆగిపోయాడు. ఆదిత్యకు వాళ్ల మాటలు నచ్చలేదు. “మత్తు పదార్థాలు మొదట సరదాగా కనిపిస్తాయి. కానీ తర్వాత మన ఆరోగ్యం, చదువు, కుటుంబం అన్నింటినీ నాశనం చేస్తాయి.” అని సైన్స్ టీచర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆదిత్య వెంటనే, వద్దు వినయ్.. వెళ్లకు. అవి మంచివి కావు. మన భవిష్యత్తును పాడు చేస్తాయి’ అన్నాడు. కానీ వినయ్ కొంచెం అయోమయంలో పడ్డాడు. ‘ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది?’ అని అన్నాడు. ఆదిత్య అతని చేతిని గట్టిగా పట్టుకుని, ‘నువ్వు వెళ్లడానికి నేను ఒప్పుకోను. మన అమ్మానాన్నలు కూలి పనులకు వెళ్లి, రోజంతా కష్టపడుతున్నారు. మన జీవితాలు బాగుండాలని పనికి పంపకుండా, చదివిస్తున్నారు. అంతేకాదు మనం కబడ్డీ ఆటలో జిల్లా స్థాయిలో ఎంపికయ్యాము.. ప్రాక్టీసు చేయాలి. పెద్ద చదువు చదవాలని, ఉద్యోగం చేయాలని కలల కంటున్నాము. ఇప్పుడు ఈ తప్పు చేస్తే.. జీవితాంతం బాధపడాలి. ఒక తప్పు అలవాటు వల్ల ఇవన్నీ కోల్పోవద్దు’ అన్నాడు. వినయ్ వెంటనే ఆదిత్య మాటల్లో నిజాన్ని గ్రహించాడు. ఆదిత్యతో పాటు ముందుకు అడుగేశాడు. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరుసటి రోజు స్కూల్లో ప్రధానోపాధ్యాయులు “మత్తు పదార్థాలు- ప్రమాదాలు” అనే అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ వచ్చి, స్కూలు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్టేజ్ ముందు కూర్చున్నారు. స్టేజ్ పై ఉపాధ్యాయులతో పాటు ఓ డాక్టర్ కూడా ఉన్నారు. ఆయన నిలబడి, పిల్లలను ఉద్దేశించి ప్రశంగం చేశారు. ‘చిన్న వయసులో మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చెడు మార్గం ఎంచుకుంటారు. అది చూసి కుటుంబం బాధపడుతుంది. జీవిత లక్ష్యాలు దూరమవుతాయి. సమాజంలో గౌరవం ఉండదు. ఎవరూ దగ్గరకు రానివ్వరు. చెడు ప్రవర్తన వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు నుంచే చెడు మార్గంలోకి వెళ్లకుండా నిర్ణయించుకోండి’ అని చెప్పారు.
ఆ మాటలు విన్న వినయ్‌కు నిన్నటి సంఘటన గుర్తొచ్చింది. ఆదిత్యతో, ‘నువ్వు నన్ను ఆపకపోతే నేను తప్పు చేసేవాడిని’ అన్నాడు. ఆదిత్య నవ్వుతూ, ‘నిజమైన స్నేహితుడు తప్పు దారిలో వెళ్లనివ్వడు’ అన్నాడు.
ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసి స్కూల్లో ‘‘చిన్న నిర్ణయం- పెద్ద మార్పు’’ అనే విద్యార్థులతో క్లబ్ ప్రారంభించారు. పిల్లల దృష్టి మత్తు పదార్థాల వైపు మళ్లకుండా ప్రయత్నించారు. ఖాళీ సమయంలో ఆటలు ఆడించడం, గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు పంపిణీ చేసి, చదివించడం చేశారు. మంచి అలవాట్లు గురించి డిబేట్లు నడిపారు. క్రమంగా స్కూల్లో మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిలోనూ మార్పు రావడం మొదలైంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా- పిల్లలు మంచి మార్గంలో నడవాలని ఆదిత్య, వినయ్ మంచి ప్రయత్నం చేశారు. వీరి కృషిని గుర్తించిన ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు వారిని అభినందించారు.
పద్మావతి
9490559477








కామెంట్‌లు (0)