test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆనందవనం!

04 జూన్, 2026

anandavanam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 04:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆనందవనం అనే అందమైన అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. ప్రతి సంవత్సరం శీతాకాలంలో నగరంలోని పాఠశాల పిల్లలు అక్కడికి పిక్నిక్‌కు వచ్చేవారు. ఒకసారి బిట్టు అనే బాలుడు తన స్నేహితులతో కలిసి ఆనందవనానికి వెళ్లాడు. వాళ్లు భోజనం చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, చెత్తను అక్కడే పడేసి వెళ్లిపోయారు.
​అదే సమయంలో చుట్కీ అనే తెలివైన కోతి తన స్నేహితులతో కలిసి ఆ చెత్తను శుభ్రం చేయడానికి వచ్చింది. కానీ పిల్లలు అపార్థం చేసుకున్నారు. “కోతులు మన ఆహారం తీసుకెళ్లడానికి వచ్చాయి!” అనుకుని వాటిపై రాళ్లు, ఖాళీ సీసాలు విసిరారు. భయపడిన కోతులు కూడా అరుస్తూ పరుగులు తీశాయి. ఈ విషయం అడవి రాజు సింహం చెవిన పడింది. అడవికి వచ్చిన అతిథులను కోతులు భయపెట్టాయని అది భావించింది. చుట్కీని, దాని స్నేహితులను ఒక సంవత్సరం పాటు అడవి నుంచి వెళ్లిపోవాలని ఆజ్ఞాపించింది.
​విచారంగా నగరానికి వచ్చిన చుట్కీ ఒకరోజు బిట్టు ఇంటి దగ్గరికి వెళ్లింది. అక్కడ ఒక విషయం చూసి ఆశ్చర్యపోయింది. బిట్టు కుటుంబం తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా వేస్తోంది. చుట్కీకి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు బిట్టు చెత్తను వీధి చివర ఉన్న చెత్త కుండీలో వేయగానే, చుట్కీ దానిని తీసుకొచ్చి బిట్టు ఇంటి ముందు పడేసింది. అలా రెండు మూడు రోజులు చేసింది.
​కోపంతో బిట్టు చుట్కీని పట్టుకోవడానికి వచ్చాడు. అప్పుడు చుట్కీ బాధగా, “బిట్టూ! మీ ఇంటి ముందు చెత్త ఉంటే నీకు ఇష్టం ఉండదు కదా? మరి మా అడవిలో ఎందుకు చెత్త పడేశావు? మేము మీ ఆహారం కోసం రాలేదు. మీరు పడేసిన ప్లాస్టిక్ చెత్తను తీసేయడానికి వచ్చాము. కానీ మీరు మాపై దాడి చేశారు. అందుకే మేము మా అడవిని వదిలి రావాల్సి వచ్చింది” అని చెప్పింది.
​చుట్కీ మాటలు విన్న బిట్టు చాలా బాధపడ్డాడు. “నన్ను క్షమించు చుట్కీ. మా తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది” అన్నాడు. ఆ రోజు నుంచి బిట్టు, చుట్కీ మంచి స్నేహితులయ్యారు. కొన్ని నెలలు గడిచాక మళ్లీ పాఠశాల పిక్నిక్ సమయం వచ్చింది. ఈసారి బిట్టు తన స్నేహితులకు చుట్కీ కథ చెప్పాడు. ప్లాస్టిక్ వల్ల జంతువులకు కలిగే ప్రమాదాల గురించి వివరించాడు. పిల్లలందరూ మారిపోయారు. అడవిలో చెత్త వేయకూడదని నిర్ణయించుకున్నారు. అక్కడ చెత్త బుట్టలు ఏర్పాటు చేశారు. “తీసుకొచ్చిన ప్లాస్టిక్‌ను తిరిగి తీసుకెళ్లాలి” అనే నియమం కూడా పెట్టుకున్నారు. ఈ మార్పు చూసి జంతువులన్నీ సంతోషించాయి. విషయం తెలుసుకున్న సింహం కూడా తన తప్పును ఒప్పుకుంది. చుట్కీని తిరిగి అడవికి ఆహ్వానించింది. జంతువులందరి ముందు చుట్కీని మెచ్చుకుంది. ఆ రోజు నుంచి ఆనందవనం మళ్లీ శుభ్రంగా, అందంగా మారింది. జంతువులు సంతోషంగా జీవించాయి.
​నీతి: ప్రకృతిని కాపాడితేనే అన్ని జీవులు సంతోషంగా జీవించగలవు.

​- ఆదిత్య పట్నాయక్,
విశాఖపట్నం, 89844 33779.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్