test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాల సాహితీ సహోదరులు

22 మే, 2026

బాల సాహితీ సహోదరులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 09:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమ్మమ్మ అందించిన ప్రోత్సాహం, ఆ ఇంటి సాహిత్య సాంస్కృతిక వాతావరణం అందించిన ప్రేరణతో చక్కని తెలుగు బాలసాహిత్య రచయితలుగా ఎదిగారు విశాఖకు చెందిన దివాకర్ల సాయి అఖిలేష్, వెంకట్ అఖిలేష్. అమ్మమ్మ బాలబాట రమణమ్మ అందించిన స్ఫూర్తితో ఈ విజయం సాధించారు. దివాకర్ల నాగజ్యోతి, జనార్ధన్ వారి తల్లిదండ్రులు. శతభి, అప్పాజీ అనేవి అఖిలేష్ – అభిషేక్ ల ముద్దు పేర్లు.
​శతభి, అప్పాజీల బాల్యం వాళ్ల అమ్మమ్మ ఇంట్లో గడిచింది. రైల్వే స్కూల్లో టీచర్ గా పని చేసి రిటైరైన వీరి అమ్మమ్మ రమణమ్మ బాల సాహితీవేత్త. బాలబాట పత్రిక సంపాదకురాలు. పిల్లలకు చదువులతో పాటు సాహిత్యం, లలిత కళలు నేర్పాలనేది ఆమె తపన. పాఠశాలలోనూ, సెలవుల్లో ఇంటివద్దా ఆమె అదే పనిలో నిమగ్నమై ఉండేవారు. రిటైర్డ్ అయ్యాక పిల్లల కోసం బాలబాట అనే మాస పత్రిక ప్రారంభించి, నడుపుతున్నారు. పత్రికలో ప్రచురణ కోసం వచ్చే ఉత్తరాలు, కవర్లు ఆమె ముందేసుకుని చదువుతూ ఉంటే … ఈ ఇద్దరు మనవళ్లూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవారు. తాము అలా వ్రాయాలి.. చదవాలి.. అని తెగ తపనపడేవారు. ​ఒకరోజు శతభి, అప్పాజీ వాళ్ళ అమ్మమ్మను “మేము రాయవచ్చా?” అని అడిగారు. “ఓ నిక్షేపంగా రాయవచ్చు” అన్నారు రమణమ్మ. అప్పటికి మూడో తరగతి ఒకరు, ఒకటో తరగతి మరొకరు చదువుతున్నారు. అది మొదలు.. ఏదో ఒకటి రాయడం.. అమ్మమ్మకు చూపించి, ఆమె సలహాలతో మళ్లీ సరిచేయడం కొనసాగించారు. అలా చిట్టి చిట్టి కవితలు, బుల్లి బుల్లి కథలు రాశారు. అవి బాలబాట పత్రికలో అచ్చవడంతో వారిలో ఉత్సాహం పెరిగింది. ఫ్రెండ్స్ అంతా మెచ్చుకోవడంతో ఇంకా రాయాలనే కోరిక పెరిగింది. పెన్సిల్‌, కోతి- చిలుక, గాజులు, అమ్మ నాన్న, పుస్తకం, స్నేహం, అరటి పండ్లు వంటి శీర్షికలతో బుల్లి బుల్లి కవితలు, గేయాలు బాలబాటతో వచ్చాయి. ఆంధ్రభూమి పత్రికలోనూ, 2011 ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచికలోనూ వీరి కవితలు, గేయాలు అచ్చయ్యాయి, వాటన్నిటినీ కలిపి 2012లో “బాల తరంగాలు” పేరుతో పుస్తకం ప్రచురించి, వాళ్ళ అమ్మమ్మకు అంకితం ఇచ్చారు. ఆ తరువాత అభిషేక్ ఆరు కథలు, అఖిలేష్ నాలుగు కథలు రాసి “తెలివైన ఉడత” పేరుతో 2013లో కథల సంపుటి వెలువరించారు. దీనిని అమ్మమ్మ గారి తల్లి.. వాళ్లు ప్రేమగా “పెద్ద” అని పిలుచుకునే సత్యవాడ నారాయణమ్మ గారికి అంకితం ఇచ్చారు.
ఇప్పుడు అభిషేక్ ఎంటెక్ మిషన్ డిజైనింగ్ పూర్తిచేసి, ‘టెక్నికల్ ప్రోజెక్ట్ కో ఆర్డినేటర్ గా అమెరికాలో పనిచేస్తున్నాడు. దేశ కాల ప్రస్తుత పరిస్థితుల వల్ల సాహిత్యంలో అంతగా కృషి చేయకపోయినా ఏమాత్రం సమయం దొరికినా పుస్తకాలు చదువుతున్నాడు. వెంకట అఖిలేష్_అప్పాజి విశాఖపట్నంలోనే ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కథలు రాస్తున్నాడు. ఈ ఇద్దరు సోదరులూ భవిష్యత్తులోనూ మంచి కథలు రాసే ఆలోచనలో ఉన్నారు.
​- డా. అమ్మిన శ్రీనివాసరాజు
77298 83223.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్