test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కథ కంచికి.. మనం ఇంటికి!

22 మే, 2026

కథ కంచికి.. మనం ఇంటికి!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శివలింగపురం గ్రామ శివారున ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. జున్నుబాబు తన స్నేహితులతో కలిసి ప్రతి ఆదివారం ఆ మర్రిచెట్టు దగ్గర దాగుడుమూతలు, దొంగ-పోలీస్‌ ఆడుకున ేవాడు. పిల్లలంతా ఊడలు పట్టుకుని ఉయ్యాలలు ఊగేవారు. ఆ తర్వాత కాశీతాత చెప్పే కథలు విని, సాయంత్రం కాగానే ఇంటికి చేరుకునేవారు.
ఒక ఆదివారం కాశీతాత ‘మృగరాజు సందేశం’ అనే కథ చెప్పారు. జున్నుబాబుతో సహా పిల్లలందరూ ఆసక్తిగా విన్నారు. కాసేపటికి కథ పూర్తయింది. ‘కథ కంచికి.. మనం ఇంటికి’ అన్నారు కాశీతాత. పిల్లలందరూ అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ‘కథ కంచికి ఎందుకు వెళ్తుంది తాతయ్యా?’ అని ఆశ్చర్యంగా అడిగాడు జున్నుబాబు. ‘కథ కంచికి ఎందుకు వెళ్తుందో చెబుతాను వినండి’ అంటూ తాతయ్య వివరించారు.
‘పిల్లలూ.. ‘కథ కంచికి మనం ఇంటికి’ అనేది ఒక జాతీయం. పూర్వకాలంలో కాంచీపురం (కంచి) విద్యలకు నిలయంగా ఉండేది. ఉత్తరాదిన కాశీ ఎంత ప్రసిద్ధమో, దక్షిణాదిన కంచి అంత గొప్పది. అక్కడ గొప్ప గొప్ప వేద పండితులు, సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన పారంగతులు ఉండేవారు. అక్కడ ‘ఘటికాస్థానములు’ (విద్యార్థుల అర్హతను పరీక్షించే కేంద్రాలు) ఉండేవి.
ఎవరైనా కొత్తగా ఏదైనా గ్రంథాన్ని రచిస్తే, దాన్ని సమీక్ష కోసం ఈ ఘటికాస్థానాలకు పంపేవారు. అక్కడ ఉండే ఉద్ధండ పండితులు ఆ గ్రంథాన్ని చదివి ఆమోదముద్ర వేస్తే, అది ప్రామాణికమైన గ్రంథంగా గుర్తింపు పొందేది.
అలా అప్పటినుంచి కథ చెప్పడం పూర్తవగానే, కథ కంచికి.. మనం ఇంటికి! అనడం ఆనవాయితీగా వచ్చింది. అంటే ఆ కథ తన చివరి మజిలీ అయిన కంచికి చేరుకుందని, ఇక మనం ఇంటికి వెళ్లవచ్చని అర్థం’ అని వివరించారు తాతయ్య. ‘ఓహో.. ఇదా అసలు రహస్యం!’ అంటూ పిల్లలందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. చీకటి పడుతుండటంతో తాతయ్యతో కలిసి అందరూ ఇళ్లకు బయలుదేరారు.
– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్