అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక చిన్న ఏనుగు ఉండేది. దాని పేరు ‘గజ’. గజ చాలా తెలివైనది. మిగిలిన జంతువుల్లా కాకుండా, గజకు ఒక వింత అలవాటు ఉండేది. అడవిలో ఏ జంతువుకు దెబ్బ తగిలినా, గజ తన తొండంతో సెలయేటి నీళ్లు తెచ్చి కడిగేది, అడవిలో దొరికే పసరు ఆకులను సేకరించి, వాటి గాయాలకు పూత వేసేది. అడవిలోని జంతువులన్నీ గజను “అడవి వైద్యుడు” అని పిలుచుకునేవి. ఒకసారి ఆ అడవికి పక్కనే ఉన్న ఒక పెద్ద కొండ ప్రాంతంలో భారీగా రాళ్లు విరిగిపడ్డాయి. అక్కడ నివసించే కుందేళ్లు, లేళ్లకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన గజ, వెంటనే తన దగ్గరున్న పసరు మందులతో అక్కడికి బయలుదేరింది. కానీ, అడవికి రాజు అయిన సింహం గజను ఆపింది.
“గజా! నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ కొండ జంతువులు మన అడవికి చెందినవి కావు. పైగా, నువ్వు అక్కడికి వెళ్తే మన అడవిలో ఉండే మందులన్నీ ఖర్చయిపోతాయి. భవిష్యత్తులో మనకేమైనా అయితే ఎవరు చూస్తారు?” అంది.
అప్పుడు గజ చాలా నిదానంగా, “రాజా! సాయం చేసే చేతికి ఇల్లాలు, ఊరు అని తేడాలు ఉండవు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మన సాయం ఉండాలి. నేను మందులు ఇవ్వడం వల్ల అవి తగ్గిపోవు, ఆ చెట్లు మళ్ళీ చిగురిస్తాయి. కానీ, సకాలంలో సాయం అందక ప్రాణాలు పోతే అవి మళ్ళీ రావు కదా!” అని వినయంగా సమాధానం ఇచ్చింది.
సింహం, గజ మాటలకు ఆలోచనలో పడింది. గజ కొండ ప్రాంతానికి వెళ్లి, అక్కడి జంతువులన్నింటికీ చికిత్స చేసి, అవి కోలుకునే వరకూ అక్కడే ఉండి, సేవ చేసింది. కొన్ని రోజుల తర్వాత, గజ ఉన్న అడవిలో పెద్ద కార్చిచ్చు (అడవి మంటలు) చెలరేగింది. అప్పుడు ఆ కొండ ప్రాంతం నుండి వందలాది జంతువులు వచ్చి, నీళ్లను తెచ్చి ఆ మంటలను ఆర్పడంలో సాయం చేశాయి. అలా గజ చేసిన చిన్న సాయం, మొత్తం అడవిని కాపాడేంత పెద్దదిగా మారింది.
నీతి: “మనం చేసే సాయం ప్రాంతాల సరిహద్దులు చూడకూడదు. మానవత్వంతో సాయం చేసేవారికి లోకమంతా ఒకటే కుటుంబం.
- వెలుగు జావళి ,
9వ తరగతి, ZPHS, బీర్పూర్,
జగిత్యాల జిల్లా, తెలంగాణ.








కామెంట్‌లు (0)