ఒక రోజు సాయంత్రం, రావిచెట్టు కింద మురళి, అతని స్నేహితుడు వెంకన్న కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మురళి మనవడు జున్నుబాబు పక్కనే ఇసుకలో బొమ్మలు గీస్తూ వారి మాటలను ఆసక్తిగా వింటున్నాడు. ‘ఈ మధ్య వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. కాలువల్లో పూడిక కూడా తీయడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా పంచాయతీ వాళ్లు పట్టించుకోవడం లేదు’ అన్నాడు వెంకన్న అసహనంగా. ‘పంచాయతీ వారికి నేను కూడా చాలాసార్లు చెప్పాను. అయినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు’ అన్నాడు మురళి ప్రశాంతంగా. అంతవరకు మౌనంగా విన్న జున్నుబాబు ఆసక్తిగా, ‘తాతయ్యా! ‘నిమ్మకు నీరెత్తినట్లు’ అంటే ఏమిటి?’ అని అడిగాడు. మురళి మనవడిని దగ్గరకు తీసుకుని, ‘నీరెత్తడం అంటే నీరు పోయడం బాబూ. నిమ్మచెట్టుకు నీళ్లు పోస్తే దాని సన్నని వేళ్లు వాటిని వెంటనే పీల్చుకుంటాయి. కొద్దిసేపటి తర్వాత చూస్తే అక్కడ నీళ్లు పోశామా లేదా అన్నట్టుగా ఉంటుంది’ అని చెప్పాడు.
‘అంటే నీళ్లు పోసిన ఆనవాళ్లు కూడా కనిపించవా, తాతయ్యా?’ అని ఆశ్చర్యంగా అడిగాడు జున్నుబాబు. ‘అవును, మచ్చుకైనా కనిపించవు బాబూ! అందుకే ఎంత చెప్పినా, ఎంత బోధించినా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయేవారిని ‘నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు’ అని అంటారు’ అని వివరించాడు మురళి. ‘అంటే పంచాయతీ వాళ్లకు ఎంత చెప్పినా వారు వినడం లేదన్నమాట!’ అన్నాడు జున్నుబాబు. ‘అవును బాబూ! సరిగ్గా అర్థం చేసుకున్నావు’ అని కొద్దిసేపు ఆగి, ‘కొన్ని ప్రాంతాల్లో ఈ సామెతను మరో అర్థంలో కూడా వాడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండే వారిని కూడా ‘నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు’ అంటారు’ అని వివరించాడు మురళి.
‘అంటే ఒకే సామెతను రెండు సందర్భాల్లో వాడతారన్నమాట!’ అన్నాడు జున్నుబాబు. ‘అవును బాబూ! సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది’ అన్నాడు మురళి. ‘ఇప్పుడు ఈ సామెత వెనుక ఉన్న అసలు విషయం బాగా అర్థమైంది, తాతయ్యా!’ అని జున్నుబాబు సంతోషంగా అన్నాడు. ‘శభాష్! విషయాన్ని చక్కగా గ్రహించావు. సామెతల అందం కూడా అదే. చిన్న మాటలో పెద్ద భావాన్ని చెబుతాయి’ అంటూ మురళి ప్రేమగా మనవడి తలను నిమిరాడు.
– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.








కామెంట్‌లు (0)