test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపిట్ట దాహం

22 మే, 2026

పిట్ట దాహం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 09:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వేసంగి సెలవులు ఇవ్వడంతో చిట్టి, బంటి మధ్యాహ్నం పన్నెండుకల్లా ఆటోలో ఇంటికొచ్చారు.
తలుపునకు తాళం వేసి ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్లిందనే విషయం మీద అక్కాతమ్ముళ్లిద్దరు చర్చ ప్రారంభించారు.
‘కూరగాయలు తేవడానికి వెళ్లిందేమో..’ బంటి అన్నాడు.
రైతుబజారుకు వెళ్లుండదు బంటీ.. ఇవాళ సాయంత్రం మన వీధిలో సంత ఉందిగా..
‘మరెక్కడికి వెళ్లుంటుంది.. పోనీ గుడికి ఏమైనా వెళ్లిందంటావా’ మళ్లీ అడిగాడు బంటి.
‘లేదు తమ్ముడూ.. పొద్దున సిలిండర్‌ ఖాళీ అయిందని నాన్నతో చెబుతుంటే విన్నా.. బహుశా ఏజెన్సీ వద్దకు వెళ్లిందేమో’ అనుమానం వ్యక్తం చేసింది చిట్టి.
‘అమ్మో గ్యాస్‌ కోసమా! అక్కడ పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటాయి. రోజూ పేపర్లో, టీవీలో చూస్తున్నాంగా..’ కళ్లు పెద్దవి చేస్తూ చెప్పాడు బంటి.
‘ఏం చేస్తాం తప్పదుగా.. గ్యాస్‌ లేకపోతే ఇబ్బందేగా మరి!’ అంటుండగా.. ‘అక్కా దాహమేస్తుందే’ అనడిగాడు.
బడికి తీసుకెళ్లిన ఇద్దరి సీసాల్లో నీళ్లయిపోయాయి. పెరట్లో పంపు తిప్పాడు ఆశగా.. చుక్క నీరు వస్తే ఒట్టు.
‘ఈ సమయంలో నీళ్లు రావు బంటీ..’ సాగదీస్తూ చెప్పింది చిట్టి.
ఇప్పుడెలా మరి.. నాగొంతు ఎండిపోతోంది… ఏడుస్తున్నాడు బంటి.
సరే.. నువ్వలా కూచో.. నేను వీధి చివర్న పెట్టిన చలివేంద్రానికి వెళ్లి మంచినీళ్లు తెస్తానంటూ ఖాళీ సీసా తీసుకుని బయటపడింది.
ఐదు నిమిషాల్లో అక్క తెచ్చిన చల్లని నీటిని గటగట తాగి ఊపిరి పీల్చుకున్నాడు బంటి.
సరిగ్గా అప్పుడే నాలుగైదు పిచుకలు పెరట్లో నాలుగు దిక్కులా తచ్చాడుతున్నాయి. వాటి వాలకం చూస్తుంటే అవి నీళ్ల కోసం వెతుకుతున్నాయని చిట్టి ఇట్టే గ్రహించింది.
వెంటనే మెట్ల కింద ఉన్న మట్టి మూకుడు తెచ్చి అందులోకి సీసాలోని నీళ్లను ఒంపి దూరంగా నిలబడింది. ఆ పిచుకలు ఒక్క ఉదుటున మూకుడు అంచుపై వాలి నీళ్లను తాగుతుంటే చిట్టి మోములో ఆనందం తొణికిసలాడింది.
‘ఏం చేస్తున్నావు అక్కా? అని తమ్ముడు ప్రశ్నించగా.. ఇలా చెప్పింది..
దాహం మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా.. మనం నీళ్లు కావాలని అడుగుతాం.. పాపం అవి అడగలేవు.. రేపటి నుంచి మనం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పక్షుల కోసం మూకుడులో నీళ్లు పోసి పెడదాం.
సరే అక్కా.. అంటూ తలూపాడు బంటి.

– చెన్నాప్రగడ శర్మ, *94405 87567​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్