బిజినెస్ : పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో …. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయనే సంకేతాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో భారత మార్కెట్లకు మరింత ఊతమిచ్చింది.
ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్ల వరకు ఎగసి, 76,282 స్థాయికి చేరింది. నిఫ్టీ కూడా 261 పాయింట్లు లాభపడి 23,980 వద్ద కొనసాగింది. ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు గణనీయంగా పెరిగాయి. మరోవైపు హిందాల్కో, ఓఎన్‌జీసీ, టీసీఎస్, మ్యాక్స్ హెల్త్‌కేర్, సన్ ఫార్మా షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.35 వద్ద కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ చర్చల్లో ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడం ప్రపంచ మార్కెట్లలో సానుకూల భావనను కలిగించింది. దీంతో పశ్చిమాసియా సంక్షోభం తగ్గొచ్చనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
ఇక అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 4.71 డాలర్లు పడిపోయి 98.81 డాలర్లకు చేరింది. ఇది గత రెండు వారాల్లో కనిష్ఠ స్థాయిగా భావిస్తున్నారు.








కామెంట్‌లు (0)