ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ ఒత్తిడితో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో ఆందోళనను పెంచాయి. యూఏఈపై జరిగిన డ్రోన్ దాడులు కూడా ముడి చమురు ధరలను మరింత ఎగదోశాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది.
మే 18 ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 1000 పాయింట్లకు పైగా క్షీణించింది. దీంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.9 లక్షల కోట్ల మేర తగ్గింది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 825 పాయింట్లు పడిపోయి 74,387 వద్ద ప్రారంభమైంది. అనంతరం మరింత పతనమై ఇంట్రాడేలో దాదాపు 1000 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే తర్వాత కొంత మేర కోలుకుని ఉదయం 11.25 గంటల ప్రాంతంలో 400 పాయింట్ల నష్టంతో 74,850 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 50 సూచీ కూడా ప్రారంభంలో 265 పాయింట్లు కోల్పోయి 23,378 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. తర్వాత కొంత పుంజుకుని 144 పాయింట్ల నష్టంతో 23,499 వద్ద కొనసాగుతోంది. ఐటీ రంగ షేర్లైన ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, ఎయిర్‌టెల్ లాభాల్లో ఉండగా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇక భారత కరెన్సీ రూపాయి కూడా డాలర్‌తో పోలిస్తే చరిత్రాత్మక కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఒక అమెరికా డాలర్ విలువ రూ.96.20కు చేరుకోవడం ఆర్థిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, వాణిజ్య లోటు మరియు ద్రవ్యోల్బణం రూపాయి బలహీనతకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
హార్ముజ్ ప్రాంత ఉద్రిక్తతల నేపథ్యంలో …. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య చేపట్టే అవకాశాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 111 డాలర్లకు చేరింది. మరోవైపు రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఇచ్చిన ఆంక్షల మినహాయింపు గడువు ముగియడంతో భారత్‌పై అదనపు ఒత్తిడి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు భారంగా మారుతోంది.








కామెంట్‌లు (0)