test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ద్రవ్యోల్బణానికి పెట్రో ధరల ఆజ్యం

26 మే, 2026

fuel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 26, 2026, 11:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 5 శాతానికి చేరనున్న సిపిఐ

  • చమురు ధరలతో రవాణా భారం

  • ద్వితీయార్థంలో వడ్డీ రేట్లు పెరగొచ్చు

  • ఆర్థిక నిపుణుల హెచ్చరిక

‌న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు బంగారం, వెండిపై పెంచిన దిగుమతి సుంకాల ప్రభావం ప్రజలపై తీవ్ర పడనుంది. ఈ పరిణామాల వల్ల రాబోయే జూన్ నాటికి దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5 శాతానికి చేరుకోవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం 11 రోజుల వ్యవధిలోనే లీటరు పెట్రోల్‌పై రూ.7.38, డీజిల్‌పై రూ.7.48 మేర భారం పెరగడం గమనార్హం. ఈ ధరల పెరుగుదల రవాణా, నిల్వ, విద్యుత్ వంటి కీలక రంగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. అంతిమంగా సాధారణ వినియోగదారులపై తీవ్ర భారం పడనుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 96కు క్షీణించడం ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. గడిచిన ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం సూచీ 8.3 శాతానికి ఎగిసి.. 42 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం ధరల ఒత్తిళ్లకు అద్దం పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారున.
​ ‘పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు వల్ల మే నెలలో ద్రవ్యోల్బణం 4-4.5 శాతంగా, జూన్‌లో 4.5-5 శాతం పరిధిలో ఉండవచ్చు.’ అని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డికె శ్రీవాస్తవ అంచనా వేశారు. ఇది సరఫరా లోపాల సమస్య కాబట్టి కేవలం ఆర్‌బిఐ రెపో రేట్లను సవరించడం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన ధరల ప్రభావం స్థిరపడే వరకు ఆర్‌బిఐ కనీసం ఒక త్రైమాసికం పాటు వేచి చూడాలని, ఒకవేళ ద్రవ్యోల్బణం 5 శాతం దాటి పైకి కదిలితేనే వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్నారు.

ద్వితీయార్థం కఠినమే..!

‘రాబోయే రోజుల్లో రవాణా ఛార్జీలు, ముడిసరుకు ఖర్చులు మరింత పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి. ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆర్‌బిఐ రాబోయే సమీక్షలో దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 6.9 శాతం నుండి 6.7 శాతానికి తగ్గించక తప్పదు.’ అని బార్క్లేస్‌ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ ఆస్థా గుద్వానీ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు ఇంధన ధరల పెంపు వల్ల జూన్ ద్రవ్యోల్బణం దాదాపు 38 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని ఇండియా రేటింగ్స్ డైరెక్టర్ మేఘా అరోరా ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ భారం ప్రజలపైకి బదిలీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

​కుటుంబాలకు కష్టమే..!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండవచ్చని క్రిసిల్ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ దీప్తి దేశ్‌పాండే అన్నారు. పెరిగిన ఇంధన ఖర్చులు, బలహీనపడిన రూపాయి వంటి ప్రతికూలాంశాల వల్ల కుటుంబాల ద్రవ్యోల్బణ అంచనాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఈ ఇంధన ధరల భారం మే నెల గణాంకాలపై స్వల్పంగానే ఉన్నా.. జూన్ నుండి మార్కెట్‌లో చాలా విస్తృతంగా కనిపిస్తుందని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 5న జరగబోయే ఆర్‌బిఐ పరపతి సమీక్షా (ఎంపిసి) సమావేశంలో ప్రస్తుతానికి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.. ద్వితీయార్థంలో మాత్రం రేట్ల పెంపు తప్పకపోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్