కిలో సిఎన్‌జిపై రూ.2 పెంపు
ధరలు పెంపుదల నాలుగోసారి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ ప్రభుత్వం మళ్లీ షాకిచ్చింది. సిఎన్‌జి ధరలను మరోసారి పెంచింది. కిలో సిఎన్‌జిపై రూ.2 పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో సిఎన్‌జి ధర రూ.81.09 నుంచి రూ.83.09కి చేరింది. ధరలను పెంచడం ఈ నెల 15వ తేదీ నుంచి ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మే 15న మొదట కిలోకు రూ.2 పెంచగా.. అనంతరం రెండుసార్లు రూపాయి చొప్పున కేంద్రం పెంచింది. తాజాగా మరో రూ.2 పెరగడంతో నాలుగోసారి సిఎన్‌జి ధరలు పెరిగినట్లయ్యింది. మే 15న కిలోకు రూ.2, మే 17న కిలోకు రూ.1, మే 23న కిలోకు రూ.1, మే 26 (తాజాగా) కిలోకు రూ.2 పెంచింది.
గత 11 రోజుల్లో మొత్తం రూ.6 వరకు ధరలు పెరగడంతో వాహనదారులు, ఆటో, క్యాబ్, ట్రాన్స్‌పోర్ట్ రంగాలపై అదనపు భారం పడనుంది. ఉత్తర భారతంలోని ప్రధాన నగరాలైన నోయిడాలో రూ.91.70 ఉండగా, ఘజియాబాద్ రూ.91.70, గురుగ్రామ్ రూ.88.12, అజ్మీర్ రూ.92.44గా ఉంది. ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.








కామెంట్‌లు (0)