test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వచ్చేది కఠిన కాలమే..!

25 మే, 2026

nirmala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 26, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎరువుల ధరలు అమాంతం పెరుగుదల

ముంబయి : ప్రపంచ వాణిజ్యం, పరిశ్రమలకు రాబోయే దశాబ్దం అత్యంత సవాలుతో కూడుకున్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి దశాబ్దాల కాలంలోనే అత్యంత అనిశ్చితి స్థితిని ఎదుర్కొంటోం దన్నారు. సోమవారం ముంబయిలో జరిగిన టెక్స్‌ప్రోసిల్ ఎక్స్‌పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న స్వదేశీ రక్షణవాదం, వాతావరణ మార్పులు, సరఫరా గొలుసుల అస్థిరత వంటివి ఎగుమతిదారులు, తయారీదారులకు ప్రధాన ఆందోళనలుగా మారాయని అన్నారు. పలు దేశాలు ఎక్కువగా నాన్ టారిఫ్ అడ్డంకులను, రక్షణవాద చర్యలను అవలంబిస్తున్నాయన్నారు. ఇది భారతదేశం వంటి ఎగుమతి దేశాలకు ప్రపంచవ్యాప్త పోటీని మరింత తీవ్రంగా, సంక్లిష్టంగా మారుస్తోందని చెప్పారు. ​వాతావరణ మార్పులు, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు, ఎఐ వంటివి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయని మంత్రి చెప్పారు. సంక్షోభాలు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తాయన్నారు. మారుతున్న వినియోగ దారుల ప్రాధాన్యతలు, ప్రపంచ సరఫరా విధానాల నుండి ప్రయోజనం పొందడానికి భారత్‌ అనుకూలమైన స్థితిలో ఉందన్నారు.​ ఎఐ, ఆటోమేషన్లు ప్రపంచ వస్త్ర పరిశ్రమను వేగంగా మారుస్తున్నాయన్నారు. సాంకేతిక పురోగతులు వివిధ దేశాలలో కార్మిక వ్యయాలను స్థిరంగా తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకుని నిలబడటానికి భారతీయ వస్త్ర ఎగుమతిదారులు నైపుణ్యాలు, ఆవిష్కరణలు, డిజైన్ సామర్థ్యాలపై పెద్ద ఎత్తున దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ​అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ భారతదేశ ఎగుమతులు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. వృద్ధి అవకాశాలను సృష్టించడానికి, మారుతున్న ప్రపంచ డిమాండ్ విధానాలకు అనుగుణంగా పరిశ్రమలు తమను తాము మలచుకునేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్