ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జిఎఐఎల్) సుదీర్ఘ కాలం తర్వాత నష్టాల నుండి లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.400.49 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.252.66 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా 36 శాతం వృద్ధితో రూ.4,042.90 కోట్లకు పెరిగింది. అదేవిధంగా ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో విమానాశ్రయాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. మార్చి 2026తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.472 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఒక దశాబ్ద కాలంలో జిఎంఆర్ గ్రూప్ పూర్తి సంవత్సర లాభదాయకతను సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
మారుతున్న వైమానిక రంగ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ రన్‌వే ఆధునీకీకరణ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. ప్రయాణికుల రద్దీ రికార్డు స్థాయిలో పెరగడం కంపెనీకి కలిసివచ్చింది. జిఎఐఎల్ పరిధిలోని విమానాశ్రయాలు 2025-26లో రికార్డు స్థాయిలో 12.16 కోట్ల మంది ప్రయాణికులను చేరవేశాయి.
ఇందులో ఒక్క ఢిల్లీ విమానాశ్రయమే 7.87 కోట్ల మంది ప్రయాణికులను చేర్చింది. దేశ మొత్తం విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో 27 శాతం వాటాను జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహిస్తుండగా.. కంపెనీ వార్షిక ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రూ.10,835.89 కోట్ల నుండి రూ.15,200.75 కోట్లకు భారీగా పెరిగింది.
Print Editionలాభాల్లోకి జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)