test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionAP: బీచ్లలో బార్లు

04 జూన్, 2026

beach
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 09:15 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం


  • సముద్రపు ఒడ్డున మద్యం అమ్మకాలకు సర్కారు ఓకే

  • కేబినెట్ సమావేశంలో నిర్ణయం

  • తొలి విడతలో విశాఖ, చీరాల బీచ్ లలో అమ్మకాలు

  • కృష్ణానది ఒడ్డున ‘అమరావతి ఐ’

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాన్య ప్రజానీకానికి రాష్ట్రంలోని బీచ్ లు ఇక షాక్ ఇవ్వనున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర తీరాన కొద్ది సేపైనా సేద తీరుదామని వెళ్లే సగటుజీవికి ఆ కొద్ది పాటి ఊరటా దూరం కానుంది. బీచ్ లలో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే దీనికి కారణం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు సారా వ్యతిరేక ఉద్యమానికి, ఆ తరువాత మద్య నిషేద ఉద్యమానికి ఎన్ టి ఆర్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిన విషయం తెలిసిందే. మహానాడులో ఎన్ టి ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి కొద్ది రోజులు కూడా గడవకముందే టిడిపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బీచ్ లలోనూ ‘మందేసి.. చిందేయడానికి` వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బీచ్ షాక్ (beach shack) పేరిట ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిషా, గోవాలలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, అదే తరహా విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నామని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన సమాచార, పౌర సంబంధాల శాఖమంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ బీచ్ షాక్ లలో విక్రయాలు జరుగుతాయని ఆయన చెప్పారు. విశాఖపట్నం, చీరాల బీచ్ లలోతొలుత ప్రయోగాత్మంగా వీటిని ఏర్పాటు చేస్తామని, ఆ తరువాత రాష్ట్రమంతా విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఒక్కో బీచ్ లో రెండేసి షాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్‌ ‌కేసుల సత్వర విచారణ, పరిష్కారం కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు 21 పోస్టులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపామని చెప్పారు. బాధితుల కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు వీలుగా ఈ కోర్టును తక్షణమే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ , సిఐడి డిజిపి చేసిన అభ్యర్థనల మేరకు ఈ నియామకాలకు ఆమోదం తెలిపామన్నారు. రాష్ర్టంలో విమానయాన రంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన ఎపి విమానయాన పాలసీ-2026కు ఆమోదం తెలిపామని చెప్పారు. ఇంటిగ్రేటడ్‌ ‌విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ పెంపు, కార్గో, లాజిస్టిక్స్‌ ‌నెట్‌‌వర్క్‌‌ల విస్తరణ, ఏరోస్పేస్‌ ‌తయారీ రంగాల్లో పోటీతత్వమైన వాతావరణం కల్పించడం, విమానయాన నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాల విస్తరణ, అడ్వాన్స్డ్‌ ఎయిర్‌ ‌మొబిలిటీ, సుస్థిర విమాన ఇంధనం వంటి భవిష్యత్‌ ‌సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకోవడం వంటివి ఈ పాలసీ కింద చేపట్టనున్నట్లు తెలిపారు.

విబి గ్రామ్ జికి ఆమోదం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తీసుకొచ్చిన వికసిత్‌ ‌భారత్‌-‌గ్యారంటీ ఫర్‌ ‌రోజ్‌‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌(‌విబి గ్రామ్‌‌జి) పథకాన్ని రాష్ట్రంలో జులై నుంచి అమలు చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్‌ ‌జారీ చేసేందుకు మంత్రి మండలి ఆమోదించిందని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) వల్ల కూలీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వ్యక్తిగత ఫోన్‌లలో ముఖాన్ని గుర్తిస్తున్నప్పుడు యాప్‌‌లో ఎందుకు గుర్తించదని, ఇలాంటి అపోహలు సృష్టించొద్దని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవయవ దానం, మార్పిడి కార్యకలాపాలను పకడ్బందీగా నియంత్రించడానికి కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ద ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ ‌హ్యూమాన్‌ ఆర్గాన్స్‌ అండ్‌ ‌టిష్యూస్‌ ‌యాక్ట్‌-2011ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆమోదం తెలిపామని చెప్పారు. అమరావతి క్వాంటమ్‌ ‌వ్యాలీ కోసం సిఆర్‌‌డిఎ కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ర్టేషన్‌పై స్టాంప్‌ ‌డ్యూటీ, రిజిస్ర్టేషన్‌ ‌ఫీజు, యాజర్‌ ‌చార్జీలు ఇతర వర్తించే చార్జీల నుంచి మినహాయింపు ఇస్తునట్లు చెప్పారు. పోలవరం మెయిన్‌ ‌కెనాల్‌ ‌ప్యాకేజ్‌ 5, 5ఎకు ఇంతకుముందు రూ.352.60 కోట్లు కేటాయించగా ఇప్పుడు వాటిని రూ.796.66 కోట్లకు సవరించి అడ్మినిస్ర్టేటివ్‌ ‌మంజూరుకు ఆమోదం తెలిపామని వెల్లడించారు. లండన్‌‌లోని లండన్‌ ఐ తరహాలో రాష్ర్టంలో కూడా కృష్ణానది ఒడ్డున దాదాపు 6 ఎకరాల భూమిపై ‘అమరావతి ఐ’ ని సిఆర్‌‌డిఎ నిర్మించేందుకు ఆమోదించామన్నారు. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌ ‌పరిధిలో సూపర్‌ ‌బ్లాక్‌ ఎఫ్‌‌లో పనుల కోసం రూ.547.07 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపామని చెప్పారు. ఆలిండియా సర్వీస్‌ అధికారుల భవనాలకు మౌలిక సదుపాయాల కోసం రూ.94.90 కోట్లకు ఆమోదం చెప్పామన్నారు. హడ్కో విజయవాడ రీజనల్‌ ‌కార్యాలయం నుంచి రూ.300కోట్ల స్పెషల్‌ ‌టర్మ్‌ ‌లోన్‌ ‌తీసుకోవడానికి ఎపి పవర్‌ ‌ఫైనాన్స్‌ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌కు ప్రభుత్వ హామీ, గ్యారంటీ డీడ్‌ అమలు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. సిఆర్‌‌డిఎ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపు కొత్త ప్రతిపాదనలపై మరియు పాత కేటాయింపుల సమీక్షపై మంత్రుల బృందం 26వ సమావేశం చేసిన సిఫార్సులను ఆమోదించామన్నారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ‘శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ’ పేరుతో నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్-2016′ షెడ్యూల్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపామన్నారు. ఈ నెల జూన్ 7 నుండి 21 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకల నిర్వహణకు రూ.10 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎపి యోగా అండ్ నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటును ఆమోదించామన్నారు.

పలు భూ కేటాయింపులు

  • రాష్ర్టంలో పలు చోట్ల ప్రైవేట్‌ ‌సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.

  • కడప జిల్లాలోని తొండూరు, బి మట్టం,ముద్దనూరు,సింహాద్రిపురం,తొండూరు మండలాల్లో ఆంప్లస్ ఐఐఎఫ్‌ఎ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ విద్యుత్‌ ‌ప్రాజెక్టుల కోసం 322.86 ఎకరాలను నెడ్‌‌క్యాప్‌కు లీజు పద్ధతిలో కేటాయిం‌చేందుకు ఆమోదం.

  •  కడప జిల్లా బి.మట్టం మండలంలోని పాలుగురళ్లపల్లి, పాపిరెడ్డిపల్లి గ్రామాల్లో 185.55 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకొరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం నెడ్‌‌క్యాప్‌‌కు లీజు పద్ధతిలో కేటాయింపు.

  •  అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో తిమ్మాపురం, దోనిముక్కల గ్రామాల్లో 33.00 ఎకరాల ప్రభుత్వ భూమిని పవర్ గ్రిడ్ అనంతపురం కర్నూలు ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు కేటాయింపు.

  •  అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో 2ఎకరాలు, కాకినాడ జిల్లా కాకినాడ మండలం 1వ వార్డులో 1.45 ఎకరాల ప్రభుత్వ భూములను ఆయా జిల్లాల టిడిపి అధ్యక్షులకు పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం 66 ఏళ్లపాటు లీజు పద్ధతిలో ఎకరాకు రూ.1000 చొప్పున కేటాయింపు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్