డివైడర్‌ను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టిన ఆర్టీసీ బస్సు
తప్పిన పెను ప్రమాదం.. బస్సులో ఉన్నది ఒక్కరే ప్రయాణికుడు
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఆదివారం తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి కేకే మైన్ ఓపెన్ కాస్ట్ టోల్ ప్లాజా వద్ద ఒక ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెల్లంపల్లి వైపు వెళ్తుండగా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో కేవలం ఒక్కడే ప్రయాణికుడు ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ బస్సు నిండా ప్రయాణికులు ఉండి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని, బస్సు ఖాళీగా ఉండటం వల్లే పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి, ప్రయాణికుడు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న వెంటనే మందమర్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. టోల్ ప్లాజా సిబ్బంది సహాయంతో రోడ్డుపై బోల్తా పడిన బస్సును పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదం జరిగిన తీరుపై కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.








కామెంట్‌లు (0)