test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉండిలో రాక్షస పాలన

23 మే, 2026

undi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 12:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పేదల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం

  • బాధితులకు నష్టపరిహారం ఇచ్చి, పక్కా ఇళ్ళు నిర్మించాలి

  • 8న విజయవాడలో రాష్ర్ట స్థాయి రౌండ్‌‌టేబుల్‌ ‌సమావేశం

  • ప్రజా సంఘాల రాష్ట్ర నేతలు

ప్రజాశక్తి – ఉండి, పాలకోడేరు, కాళ్ల, ఆకివీడు : ఉండి నియోజకవర్గంలో రాక్షస పాలన సాగుతోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పక్షాన నిలుస్తారో? పేదలకు వ్యతిరేకంగా ఉన్న రఘురామకృష్ణరాజు వైపు నిలుస్తారో? తేల్చుకోవాలని, తక్షణం రఘురామకృష్ణరాజును అదుపు చేయకపోతే పేదలందరిని ఐక్యం చేసి అడ్డుకుంటామని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్, చేతివృత్తిదారుల సంఘాల నేతలు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు, అండ్ర మాల్యాద్రి, ఎం.భాస్కరయ్య, కంకణాల ఆంజనేయులు హెచ్చరించారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల అక్రమ కూల్చివేతను నిరసిస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో నేతల రాష్ట్ర బృందాలు ఉండి నియోజకవర్గంలో పర్యటించాయి. ఉండి మండలం ఉణుదుర్రు గ్రామంలో బాధితులతో మాట్లాడిన అనంతరం వ్యకాస రాష్ర్ట ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ… ఇళ్లు కోల్పోయిన పేదలకు నష్టపరిహారం ఇచ్చి, పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సంపన్నులు నిర్మించుకున్న గెస్ట్‌‌హౌస్‌‌లు అధికారులకు కనబడడం లేదా? అని ప్రశ్నించారు. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు ఆగడాలను అడ్డుకునేందుకు ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, అందులోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. చేతివృత్తిదారుల సంఘం రాష్ర్ట కన్వీనర్‌ ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ… 70 ఏళ్ల నుంచి నివాసముంటున్న పేదలను రోడ్డున పడేసిన ఘనత రఘురామ కృష్ణరాజుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. వ్యకాస రాష్ర్ట కోశాధికారి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ.. తరతరాలుగా పేదలు నివసిస్తున్న ఇళ్లను కూల్చివేయడం అన్యాయమన్నారు. అనంతరం ఇదే బృందం పాలకోడేరు మండలం ఎఎస్‌ఆర్‌ నగర్, మోగల్లు, గరగపర్రు గ్రామాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గంలో వికసిత్ కాదు విధ్వంసం జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఈ బృందం వెంట కెవిపిఎస్‌ ‌రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.క్రాంతిబాబు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు జక్కంశెట్టి సత్యనారాయణ ఉన్నారు. రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా పేదల ఇళ్ల కూల్చివేత ఎక్కడా జరగలేదని, ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు అత్యంత దారుణానికి పాల్పడ్డారని అండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. కాళ్ల మండలం బొండాడ గ్రామంలో పేదల ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని రాష్ట్ర నేతలు పరిశీలించారు. అనంతరం ఆకివీడు మండలం సిద్దాపురం తదితర గ్రామాల్లో బృందం పర్యటించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… ఉండి నియోజకవర్గ పరిధిలో 12 గ్రామాల్లో రెండు వేల పేదల గుడిసెలను కూల్చివేసి ఆ స్థలాలను ప్రభుత్వం అమ్ముకునేందుకు కుట్ర చేస్తోందని వివరించారు. ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే వరకూ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్