అరసం 23వ రాష్ట్ర మహాసభ ప్రారంభంలో వక్తలు
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : మార్క్సిస్టు దృక్పథంతో పని చేస్తున్న వారు అసమానతలు లేని, మూఢత్వం లేని సమాజం కోసం కలిసి పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభ తిరుపతిలో శనివారం ప్రారంభమైంది. గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్‌లో ఉదయం అరసం జెండాను రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి.సంజీవమ్మ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే మాట్లాడారు. ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చని, ఫాసిజానికి వ్యతిరేకంగా కమ్యూనిజాన్ని సుస్థిర పరిచేందుకు అరసం ఏర్పడిందన్నారు. నాటి నుండి రచయితలు చేసిన అనేక రచనలు సమాజంలో చైతన్యం తీసుకువచ్చాయని పేర్కొన్నారు. నేడు ప్రగతి శీల శక్తులు అనైక్యంగా ఉన్నాయని, ఫాసిస్టు శక్తులు మాత్రమే ఐక్యంగా ఉన్నాయని అన్నారు. ఈ ధోరణి దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రగతిశీల శక్తులకు ఎవరి ఎజెండాలు వారికి ఉన్నా, ఐక్య కార్యాచరణను బలంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అభ్యుదయ ఉద్యమాల్లో అస్తిత్వం ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఐక్య వామపక్ష ఉద్యమాలు బలపడితే దేశాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రశ్నించే వారిపై అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేసి, కేసులు పెట్టడం గర్హనీయమన్నారు. సభాధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయమైన భారతదేశం ఏర్పడుతుందని సంఘసంస్కరణ ఉద్యమం నిరూపించిందని అన్నారు. విచ్చలవిడి తనంతో అసమానతలు పెరిగి , దోపిడీ దారులు ఎక్కువ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అరసం తెలంగాణ నాయకులు వేల్పుల నారాయణ మాట్లాడుతూ అస్తిత్వ ఉద్యమాల సంఖ్య పెరుగుతోందని, కులాల పరంగా, మతాల పరంగా రచయితల సాహితీ సంఘాలు ఏర్పడటం ప్రమాదకరంగా మారుతోందని అన్నారు. మతాల పరంగా రచనలు చేసి సోషల్ మీడియాలో రెచ్చ గొడుతున్నారని విమర్శించారు. విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి.హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రచయితల ఐక్యత అనివార్యం అని తీర్మానాలు చేయడం శుభ పరిణామం అన్నారు. విరసం రాష్ట్ర బాధ్యులు బాబ్జీ మాట్లాడుతూ అనేక నిర్బంధాలు, ఆటుపోట్లను ఎదుర్కొని రచనలు చేయడం అంత సులభం కాదని తెలిపారు. అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీ నారాయణ, సాకం నాగరాజు, చిన్నం పెంచలయ్య, చారులత, గుర్రప్ప పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)