గ్యాస్, ఆయిల్ ధరల పెరుగుదలకు ట్రంప్, మోడీ కారణం
ఉద్యమాలు, పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలి
బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సరైన పాత్ర పోషించడం లేదు
విజయవాడ సభలో బి.వి.రాఘవులు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మోడీ అనుసరిస్తున్న విధానాలతో దేశ రాజకీయాల్లో ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని ఎదుర్కునేందుకు వామపక్షాలతో పాటు, ప్రజలు పోరాటాలకు, ఉద్యమాలకు సిద్ధం కావాలని
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు. ‘ప్రస్తుత రాజకీయ పరిణామాలు` అనే అంశంపై శనివారం సాయంత్రం విజయవాడ ఎంబివికెలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఇజ్రాయిల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దురాక్రమణకు పాల్పడిందని తెలిపారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడిందని, అయిల్, గ్యాస్, ఎరువుల ధరలు పెరిగాయని తెలిపారు. సంక్షోభం నుండి బయటపడేందుకు అమెరికా దాడులకు తెగబడుతున్నా ఎక్కడా విజయం సాధించలేదని పేర్కొన్నారు. మరోవైపు మోడీ ఇరాన్‌తో భారతదేశానికి ఉన్న 3000 సంవత్సరాల మిత్ర బంధానికి ద్రోహం చేసి, అమెరికాకు దాసోహం అయ్యారని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. అయినా ఇరాన్ మాత్రం ఇప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను కప్పిపుచ్చుకునేందుకు పొదుపు చేయాలని పేదలకు ఉచిత సలహా ఇస్తున్నారని అన్నారు. వృథా చేస్తున్న అదానీ, అంబానీలకు మాత్రం ఆ మాట చెప్పడం లేదని విమర్శించారు. తనను ప్రతిఘటిస్తున్నారని, తమ రక్షణ కోసమని అబద్ధాలు చెబుతూ దాడులకు తెగబడుతున్న అమెరికా ఇరాన్ యుద్ధంలో ఘోర పరాభవం పాలై చివరకు మధ్యవర్తిత్వం కోసం చైనా వద్దకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇరాన్‌తో శాంతి చర్చలు అంటూనే దాడులు చేయడంతో ఇరాన్ ప్రతిదాడి చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా శక్తి తగ్గుతోందని, ఆర్థికంగా క్షిణించిపోతోందని, అక్కడ యువతలో సోషలిజంపై ఆసక్తి పెరిగిందని పేర్కొన్నారు. దీన్నుండి బయటపడేందుకు వాణిజ్య యుద్ధం మొదలపెట్టారని, అది కూడా విజయం కావడం లేదని తెలిపారు. ఇరాన్‌పై దాడి ప్రభావం మనదేశంతోపాటు తూర్పు ఆసియా దేశాలపై కూడా పడిందని పేర్కొన్నారు. జూన్ 1 నుండి నాలుగోతేదీ వరకూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతున్నాయని, ఈ ఒప్పందం ఫలితంగా అమెరికా నుండి అన్ని వ్యవసాయ ఉత్పత్తులతోపాటు కోడి కాళ్లు కూడా దిగుమతి అవుతాయని , దేశ వ్యవసాయ, అనుబంధ రంగాలపై పెను ప్రమాదం పడుతుందని వివరించారు. ఉత్పత్తి ఒకశాతం నుండి 1.5 శాతానికి పడిపోతుందని, దీనివల్ల ఉపాధి పోతుందని అన్నారు.
మరోవైపు యువతలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతోందని, కాక్రోచ్ జనతాపార్టీ ఆ ఆసంతృప్తి నుండి పుట్టుకువచ్చిందేనని పేర్కొన్నారు. యువత ఆగ్రహానికి దానికి వస్తున్న మద్దతే నిదర్శనమని, దీన్ని తట్టుకోలేనిమోడీ ప్రభుత్వం దాని సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయించిందని వివరించారు. ఇలాంటి సమయంలో యువతలో వస్తున్న అసంతృప్తిని, ప్రజల్లో ఉన్న కోపాన్ని ఉద్యమాల రూపంలో ముందుకు తీసుకొచ్చి దేశ ప్రగతికోసం కృషి చేయాల్సిన బాధ్యత వామపక్షాల పై ఉందని అన్నారు. వారిని చైతన్యం చేసి దేశ రక్షణ కోసం ముందుకు నడిపించాల్సిన గురుతర బాధ్యత వామపక్షాలపై ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. బెంగాల్లో సిపిఎం తన ఓట్లను నిలబెట్టుకుందని తెలిపారు. కేరళలో తీవ్ర ఓటమి చెందిందరన్నారు. దేశంలో బిజెపి అరాచకాలు పెరుగుతున్న సమయంలో దేశస్థాయిలో దాన్ని బలంగా ఎదుర్కోవాల్సిన వామపక్షాలకు కేరళం ఓటమి కొంత ఇబ్బందికర పరిణామమని వివరించారు. ఇటువంటి సమయంలో బిజెపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నా దాన్ని ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ నిజాయితీగా తన పాత్ర పోషించకపోగా కేరళంలో బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అయినా వామపక్షాలు మాత్రం కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరుగుని పోరాటం చేస్తాయని తెలిపారు
మోడీ భజనలో టిడిపి, వైసిపి : వి. శ్రీనివాసరావు
రాష్ట్రంలో ఒకరినొకరు విమర్శించుకుంటున్న టిడిపి, వైసిపి నాయకులు కేంద్రంలో మాత్రం మోడీ భజన చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. సహజ వనరులు దోచుకుంటూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతున్నా ఆ పార్టీలు ప్రశ్నించడం లేదని చెప్పారు. ఈ సమయంలో బిజెపికి వ్యతిరేకంగా సిపిఎం నిలబడి పోరాడుతోందన్నారు. రాజకీయ విబేధాలు ఉన్నా ఇటీవల కాలం వరకూ టిడిపి లౌకికపార్టీ అనే అభిప్రాయం ఉండేదని, మహానాడులో ఆర్‌ఎస్‌ఎస్ భజన ద్వారా లౌకికవాదం నుండి తప్పుకుంటోందని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశానికి నష్టమని చెప్పారు. మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి లేదన్నారు. ఇటీవల కడపలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన వారికి టిడిపి, వైసిపి రెండు పార్టీలూ మద్దతు ఇచ్చాయని తెలిపారు. అకివీడులోనూ దళితుల దేవాలయం విషయంలో రెండు పార్టీలూ ఒకేమాటమీద ఉన్నాయని, ఇదే పరిస్తితి ఉంటే దళితులు, మైనార్టీలకు రక్షణ ఏమిటని ప్రశ్నించారు. పి4 పేరుతోనూ పేదలను మోసం చేస్తున్నారని వివరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి, విజయవాడ నగర నాయకులు సత్యబాబు, కృష్ణ పాల్గొన్నారు. భూపతి రమణ వక్తలను వేదిక మీదకు ఆహ్వానించారు. అంతకుముందు ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు.








కామెంట్‌లు (0)