త్వరలో రూ.5 వేల కోట్ల నిధులు
కేంద్ర బిజెపి వ్యూహంలో రాష్ర్ట ప్రభుత్వ భాగస్వామ్యం
సహజ వనరులు.. ఖనిజ సంపదల కోసమే…!
రేపు సిఎం చంద్రబాబుతో కేంద్ర ప్రతినిధుల భేటీ
ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : 2024లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (విఇఆర్) మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిప్పుడు సంస్కరణల కేంద్రంగా మారనుంది. కేంద్ర బిజెపి సర్కారు సిటీ ఎకనమిక్ రీజియన్ (సిఇఆర్) పథకాన్ని దేశంలో ఏడు నగరాల్లో అమలు చేస్తోంది. సహజ వనరులు, ఖనిజ సంపదలపై ప్రైవేట్ అధికారం కోసమే ఈ మోడల్ తెచ్చారని స్పష్టమవుతోంది. రూ.5 వేల కోట్ల కేంద్ర గ్రాంట్ కోసం విశాఖ ఎకనమిక్ రీజియన్ (విఇఆర్) ప్రతిపాదనతో రాష్ర్ట ప్రభుత్వం శరవేగంగా ఎందుకు సాగుతుందన్నది తాజా ప్రశ్న. రీజియన్ కోసం 55 వేల ఎకరాలకు రాష్ర్ట ప్రభుత్వం అన్వేషణ సాగిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 2 వేల ఎకరాలను కోరుతోంది. విఇఆర్ అమలుకు కేంద్రం నియమించిన ఐఎఎస్ అధికారి యువరాజ్ సహా పలువురు ప్రతినిధులు జూన్ 2న అమరావతిలోని సచివాలయంలో సిఎం చంద్రబాబుతో సమావేశం జరిపి సమగ్ర ముసాయిదాను కేంద్రానికి పంపనున్నారు.
పెట్టుబడుల సంగతేమిటి?
2025 నవంబర్ 14-16 వరకూ విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల మందికి భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు రాబోతున్నాయంటూ సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఊసే నేడు లేదు. అంతా విఇఆర్‌నే. అయితే, రూ.5 వేల కోట్లకు షరతులున్నాయి. సహజ వనరుల వాడకంపై సంతృప్తి చెందితేనే అవి వస్తాయి. విఇఆర్ పరిధిలో తీరంపై ఆధారపడే లక్షల మంది మత్స్యకారులు, అడవులపై ఆధారపడే గిరిజనుల ప్రస్తావన ఎక్కడా లేదు. అంతా సక్రమంగా అమలు జరిగితే 2032 నాటికి 125 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా నిర్ణయించారు.
విఇఆర్‌లో ఏం చేయబోతున్నారు?
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ.. పై 9 జిల్లాలను కలిపి విశాఖ ఎకనమిక్ రీజియన్‌గా పిలుస్తున్నారు. 520 కిలోమీటర్ల పొడవుగల సముద్ర తీరం ఇక్కడే ఉంది. 1.65 కోట్ల జనాభాతో ఐదు మున్సిపల్ కార్పొరేషన్‌లు విశాఖ ఎకనమిక్ రీజియన్‌లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్లుగా మార్చే వ్యూహం చెబుతోంది. దేశంలో ఎపి, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని విశాఖపట్నం, వారణాసి, ముంబయి, సూరత్ నగరాలను ఎంపిక చేశారు. ఇవన్నీ గ్రోత్ హబ్‌లుగా ఉంటాయని కేంద్రం చెబుతోంది.
అంతా ప్రైవేట్ వ్యూహమే….
పోర్టు ఆధారిత వాణిజ్యం, ఐటి ఆవిష్కరణ కేంద్రాలు, అధునాతన తయారీ రంగాలు సహా ప్రతిపాదనల్లో వైజాగ్ – భీమిలి మధ్య ‘బే సిటీ’ అభివృద్ధిపై ప్రస్తావన వుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వైపు విస్తరించే వైజాగ్ 2.0 అభివృద్ధి కారిడార్‌ను ‘ఏరో సిటీ’గా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ వెయ్యి ఎకరాల్లోనూ, అనకాపల్లి వద్ద 500 ఎకరాల్లో అల్యూమినియం పార్కును, ఒక ఎలక్ట్రానిక్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ అనంతరం ఒడిశా, ఛత్తీస్‌గడ్ అడవులు మొదలుకొని అరకు ప్రాంతం వరకూ గల బాక్సైట్ ఖనిజ నిక్షేపాలకు ప్రైవేట్ కార్పొరేట్లతో కలిపి ‘వల’ వేసే వ్యూహం దాగిఉంది. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టును ఇందుకు అనుగుణంగా వాడనున్నట్టు విశాఖ పోర్టు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో లైఫ్ సైన్స్, బల్క్ డ్రగ్, ఫార్మా హబ్, మెడ్ టెక్‌ల పేరుతో కొన్ని పారిశ్రామిక కేంద్రాలను నెలకొల్పాలనే వ్యూహం ఉంది. మూలపేట, కాకినాడ, నక్కపల్లి వద్ద కొత్త పోర్టుల నిర్మాణం, అలాగే శ్రీకాకుళం, విశాఖ తీర ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఎకరాల పరిధిలో బీచ్ శాండ్ మైనింగ్ పెద్ద ఎత్తున చేపట్టే వ్యూహం దీంట్లో కనిపిస్తోంది. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో భాగమైన కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల కేంద్రంగా వ్యవసాయ రంగం మొత్తాన్ని వాణిజ్య ఎగుమతుల దిశగా మార్చనున్నారు. పౌల్ట్రీ రంగాన్ని 5 నుంచి 8 రెట్లు, చేపలు, రొయ్యలు ఆక్వా సాగును లక్ష నుంచి 2.50 లక్షల ఎకరాలకు పెంచాలన్నది టార్గెట్. ఇప్పటికే ప్రభుత్వ రంగం బలంగా ఉన్న రీజియన్ ఇది. విశాఖ స్టీల్‌ప్లాంట్, పోర్టు, హెచ్‌పిసిఎల్, షిప్‌యార్డు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ‘కూటమి’ ప్రభుత్వం వాటిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు హడావిడి అంతా కార్పొరేట్లకు కట్టబెట్టడంపైనే ఉంది.








కామెంట్‌లు (0)