- విఇఆర్ సమీక్షలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ పట్నంను బే సిటీ(తీర ప్రాంత నగరం)గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులకు సూచించారు. విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక నోవాటెల్ హోటల్‌లో విశాఖ ఎకనమిక్ రీజియన్ (విఐఆర్)పై తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బే సిటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. విశాఖలోని కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ ఈ బే సిటీ ప్రాజెక్టు అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా కైలాసగిరిని తీర్చిదిద్దుతామన్నారు. విశాఖలో విఇఆర్ మోనటరింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవాలని, గ్రేహాండ్స్‌కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణకు ఇదే మంచి తరుణమని బీచ్ వాటర్ స్పోర్ట్స్‌తో పాటు వినోదం కలిగించే వివిధ ప్రాజెక్టులను చేపడితేనే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. విశాఖ జూ పార్క్‌ను ఆధునీకరించి పర్యాటకులను ఆకర్షించాలని, విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేయాలని, రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్టు, పాపికొండలు వంటి పర్యాటక ప్రాంతాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
నగరాల్లో టూరిజం ప్రాజెక్టుల చుట్టూ పారిశ్రామిక టౌన్‌షిప్‌లు అభివృద్ధి కావాల్సి ఉందన్నారు. కేంద్రంలోని నీతి అయోగ్ సమర్పించిన విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (విఇఆర్) ప్రాజెక్టు నివేదికను ప్రజల్లో చర్చకు ఉంచాలని, విద్యార్థులు, మేథావుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, డోలాశ్రీ బాలా వీరాంజనేయ స్వామి, విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకూ తొమ్మిది జిల్లాల కలెక్టర్‌లు, విఇఆర్ కన్వీనర్లు, పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్, రవాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఐటి శాఖ కార్యదర్శి భాస్కర్, విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)