test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అధికారుల వేధింపులతో విఆర్‌ఒ ఆత్మహత్య

6 రోజుల క్రితం

vro
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 12:32 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

కలెక్టర్‌ ‌హామీతో ఆందోళన విరమణ 

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్/: కర్నూలు అగ్రికల్చర్ ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక కర్నూలు మండలం గాంధీనగర్ గ్రేడ్-2 విఆర్‌ఒ (వార్డ్ రెవెన్యూ సెక్రటరీ) షేక్ మహమ్మద్ హుస్సేన్ బాషా (49) శనివారం తెల్లవారుజామున ఆయన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. హుస్సేన్ ఆత్మహత్య వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, సహచర విఆర్‌ఒలు, వందలాది మంది సచివాలయ ఉద్యోగులు ఆగ్రహంతో ఊగిపోయారు. మృతదేహాన్ని కర్నూలు కలెక్టరేట్ ఎదుటకు తీసుకువచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. బాధ్యులైన అధికారులను శిక్షించాలంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆందోళన చేపట్టారు. చివరకు కలెక్టర్‌ ‌హామీతో ఆందోళన విరమించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూలు రూరల్ మండలం వెంకాయపల్లి గ్రామానికి చెందిన హుస్సేన్‌కు భార్య రజియాభీ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో ఆయన విఆర్‌ఎగా విధులు నిర్వహించారు. 2022లో అప్పటి ప్రభుత్వం విఆర్‌ఎలను విఆర్‌ఒలుగా గుర్తించడంతో గాంధీనగర్ విఆర్‌ఒగా నియమితులయ్యారు. అయితే, విఆర్‌ఒ బాధ్యతలతో పాటు గాంధీనగర్ సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీగా అదనపు బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. మృతుడికి తీవ్రమైన వెన్నెముక (నడుము నొప్పి) సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇటీవల శస్త్రచికిత్స కూడా జరిగింది. ఎక్కువసేపు నడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ.. అధికారులు ఆయనకు ఎన్నికల విధి, కంప్యూటర్ సర్వేలు, టార్గెట్లు అప్పగించారు. "నాకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువ, పైగా శస్త్రచికిత్స జరిగి నడవలేకపోతున్నాను.. దయచేసి బిఎల్‌ఒ విధుల నుంచి మినహాయించండి లేదా బదిలీ (ట్రాన్స్‌ఫర్) చేయండి" అని అధికారులను పలుమార్లు హుస్సేన్ వేడుకున్నా వారు పట్టించుకోలేదు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన, అధికారుల వేధింపులే తన చావుకు కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహంతో కలెక్టరేట్ ముట్టడి ‌కలెక్టరేట్‌ ఎదుట మృతదేహంతో చేపట్టిన ఆందోళనకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి. అంజిబాబు, జిల్లా అధ్యక్షులు పిఎస్. రాధాకృష్ణ , జిల్లా ఉపాధ్యక్షులు జె.దివాకర్, నరసింహులు, నగేష్, ఏసురాజు, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, చిరువ్యాపారుల సంఘం జిల్లా నాయకులు మహ్మద్ రఫి , తదితర నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ ఓబులేసు, తహశీల్దార్ రవికుమార్, డిఫ్యూటీ తహశీల్దార్ ధనుంజయ్... సచివాలయ ఉద్యోగుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని, టార్గెట్లు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, మృతుడి కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని, ఇల్లు నిర్మించి ఇస్తామని , ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్సును వచ్చేలా చూస్తామని, పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో ఉద్యోగులు ఆందోళన విరమించగా, పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం ఆయన స్వగ్రామం వెంకాయపల్లి కబరస్థాన్ లో అంత్యక్రియలు నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్