test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

21న కోటి మందితో యోగా డే

03 జూన్, 2026

ap cm chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 12:20 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రాష్ట్రవ్యాప్తంగా 7 నుంచి 20 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

  • నిర్వహణ కోసం రూ.10 కోట్లు నిధులు

  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సందర్భంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది పాల్గొనేలా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నెల 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహణకు రూ.10 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించామని తెలిపారు. కోటి మందితో ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా మంచి మెడిసిన్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని భాగస్వామ్యం చేయడమే తమ లక్ష్యమన్నారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగాను అనుసరించాలని చెప్పడమే ఈ ఏడాది థీమ్ ఉద్దేశమని చెప్పారు. అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్టానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25 వేల మందితో యోగా ప్రదర్శన నిర్వహిస్తామని, ప్రతి జిల్లాకు ప్రత్యేక థీమ్‌ నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించి యోగా-టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేస్తామని, ప్రస్తుతం ఉన్న ట్రైనర్ల సంఖ్యను 2.50 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో యోగాను చదువులో భాగం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. yogandhra.ap.gov.in ద్వారా కార్యక్రమాల వివరాలు, వీడియోలు, నమోదు ప్రక్రియ తదితర సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదు

​తెలంగాణలో పవన్‌‌కల్యాణ్‌‌పై చేసిన వ్యాఖ్యలు సరికావని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానంగా చెప్పారు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యిందని, తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరని, ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో, వారికి మంచి చేయటంలో పోటీ పడాలని సూచించారు. అలాగే డిఎస్‌‌సి ద్వారా ఉద్యోగాల నియామకానికి టిడిపి ఓ బ్రాండ్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కేటగిరీల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగాయని తెలిపారు. పారదర్శకంగా చేసిన నియామకాలపై వైసిపి లేనిపోని దుష్ప్రచారం చేస్తుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్