ఈ ఏడాది రెండు ఓడరేవులు ప్రారంభిస్తాం
మంత్రి జనర్ధన్ రెడ్డి వెల్లడి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో సరుకు రవాణా రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలికాభివృద్ధి శాఖ మంత్రి బిసి జనార్ధన్‌రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు తెలిపారు. రెండేళ్ల పాలనలో ప్రగతిపై సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మౌలికాభివృద్ధి శాఖ పరిధిలో ప్రధానంగా నాలుగు ఓడరేవుల పనులను చేపట్టామన్నారు. ఇందులో మూడు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ఒకటి పిపిపి విధానంలో చేపడుతున్నట్టు చెప్పారు. వీటిల్లో రెండు ఈ ఏడాది, మరొకటి వచ్చే ఏడాది ప్రారంభమవుతాయని తెలిపారు. నాలుగోది 2028లో ప్రారంభమవుతుందని వివరించారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి చేరుకునేందుకు విశాఖ నుంచి ఏడు మార్గాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. అలాగే రూ.861 కోట్లతో 20,060 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేస్తున్నామన్నారు. మరో రూ.2,500 కోట్లతో ఇతర రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, ఇవి ఈ ఏడాది పూర్తవుతాయని చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారి భూసేకరణ, అటవీ అనుమతులు, కోర్టు కేసులు, శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటుచేసి, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు 413 కిలోమీటర్ల పొడవున, 2,640 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ సమస్యలను విజయవంతంగా పరిష్కరించగలిగామన్నారు. గోదావరి పుష్కరాలకు రూ.439 కోట్ల అంచనా వ్యయంతో 398 కిలోమీటర్ల పరిధిలో 72 పనులను చేపట్టనున్నామని తెలిపారు.








కామెంట్‌లు (0)