రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలపై చర్చ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిఎం చంద్రబాబుతో ఒఎన్‌జిసి ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ బుధవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్రంలో ఒఎన్‌జిసి చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి డెల్టా బేసిన్‌లో సహజ వాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ఇంధన రంగం అభివృద్ధికి ఒఎన్‌జిసి చేస్తున్న కృషిని, తదుపరి విస్తరణ ప్రణాళికల గురించి అరుణ్ కుమార్ సింగ్ వివరించారు. ఒఎన్‌జిసి ప్రాజెక్టులతో రాష్ట్రానికి సమకూరే ఆదాయం, ఉపాధి అవకాశాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై సిఎం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ఒఎన్‌జిసి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చూడాలని, తద్వారా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆకాంక్షించారు. రాష్ర్టాభివృద్ధిలో భాగంగా ఇంధన భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సామాజిక బాధ్యతగా ఒఎన్‌జిసి సిఎస్ఆర్ నిధులను ఆయా గ్రామాల్లో ఖర్చు పెట్టాలని సూచించారు. చమురు సహజ వాయువు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని సిఎం కోరారు. దీనిపై స్పందించిన ఒఎన్‌జిసి ఛైర్మన్.. కాకినాడ, గుంటూరులో కేన్సర్ చికిత్సల్లో వినియోగించే అధునాతన యంత్రాలను ఆస్పత్రులకు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనశాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు, ఒఎన్‌జిసి అధికారుల బృందం హాజరయ్యారు.








కామెంట్‌లు (0)