లలితా ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ర్టంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలపై డిజిటల్ హెల్త్ రికార్డుల నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరుకు సమీపంలోని తక్కెళ్లపాడు వద్ద 600 పడకలతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన లలితా హాస్పిటల్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎంఆర్‌ఐ స్కాన్ మిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ఆస్పత్రి వైద్యులు చంద్రబాబుకు వివరించారు. కేవలం ఆరు నిమిషాల్లో ఎంఆర్‌ఐ తీయడం పూర్తవుతుందని, వెంటనే నివేదిక వస్తుందని వారు వివరించారు. ఆస్పత్రి వైద్యులు పి.వి.రాఘవశర్మ, డాక్టర్ విజయను సిఎం అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ… ‘హెల్తీ సిటిజన్సే.. వెల్తీ నేషన్ నిర్మించగలరు. ఆరోగ్యానికి మించిన ఆస్తి ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే నిజమైన ధనవంతులు. వేల కోట్ల రూపాయలున్నా, భవంతులు ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు’ అని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం త్వరలో సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుందని, ప్రిడెక్టివ్, ప్రెవెంటివ్, క్యూరేటివ్ విధానాన్ని ఈ ప్రాజెక్టులో రూపకల్పన చేశామని తెలిపారు. 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గరే చేసి ఏ మందులు వేసుకోవాలి, ఎప్పుడు ఆసుపత్రులకు రావాలనే అంశాలను కూడా సంజీవని ద్వారా ప్రజలకు గైడ్ చేస్తారని తెలిపారు. త్వరలో యూనివర్సిల్ హెల్త్ పాలసీ తీసుకొస్తు న్నామని, ఒకొక్కరికి రూ.2.50 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందజేస్తామని చెప్పారు. తినే తిండి, మన పరిసరాలు, మన ఆలోచనా విధానం చాలా ముఖ్యమని, ప్రజలు సరైన ఆహార నియమాలు పాటించినప్పుడే అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు. మొత్తం యూరియా వాడుతున్న ఆహారం తీసుకుంటు న్నామని, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పారు. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలు అందించే ఆస్పత్రులను అమరావతికి రప్పిస్తున్నా మని చెప్పారు. వైద్యరంగంలో మంచిపేరు ప్రతిష్టలు సాధించిన లలితా ఆస్పత్రి వారు హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కాకుండా అమరావతిలో ఆస్పత్రిని నెలకొల్పినందుకు యజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి పి.సత్యకుమార్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)