ఎస్ఐఆర్ పై టిడిపి నేతల వర్క్ షాపులో చంద్రబాబు హెచ్చరిక
కూటమి పార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి, బ్యూరో : రాష్ట్రంలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్ -సర్) కార్య్రక్రమంను ఆషామాషీగా తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నేతలను ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఎస్ఐఆర్ పై టిడిపి కేంద్ర కార్యాలయంలో ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పరిశీలకులు, బూత్ స్థాయి ఏజెంట్లకు మంగళవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎస్ఐఆర్ పట్ల వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్ధేశం చేశారు. ‘‘సర్’పై అవగాహన పెంచుకోండి, అప్రమత్తంగా ఉండండి.` అని ఆయన అన్నారు. మన ఓట్లు ఉన్నాయో లేదో పక్కాగా చూసుకోవాలని, రాష్ట్రం నుంచి వేరే ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్ళిన వారి ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘ఎన్నికల్లో ఓటర్ల జాబితాలను ఆధారం చేసుకుని వ్యూహాలు, ప్రణాళికలు సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘సర్’ ప్రక్రియపై రాష్ట్రస్థాయి నేతలు మొదలుకుని. గ్రామస్థాయి వరకు ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలి` అని చెప్పారు. ‘వర్చువల్‌గా మహానాడును నిర్వహించుకోవడం సాధ్యమా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ సక్సెస్ చేసుకోగలిగాం. ఇప్పుడు పార్టీ యంత్రాంగంపై ‘సర్’ అనే అతి పెద్ద కీలక బాధ్యత ఉంది. ` అని అన్నారు. ‘అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండాలి. ఓటు నమోదు చేసుకోవడం పౌరుల బాధ్యత అయితే, అవగాహన కల్పించడం రాజకీయ పార్టీల బాధ్యత. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి.
ప్రతి ఓటు మ్యాపింగ్ చేయించాలి` అని దిశానిర్ధేశం చేశారు. ప్రతి 20-25 ఏళ్లకోసారి ‘సర్’ జరుగుతుంది. 2002 ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోంది. జులై 14లోపు రెండు విడతల్లో ఓట్ల మ్యాపింగ్ జరగనున్న నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ఇది తొలి పరీక్ష అవుతుందని చెప్పారు. ‘ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం కలిసి పని చేయాలి. కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ ‘సర్’పై యాక్షన్ ప్లాన్ చేయాలి. త్వరలో మూడు పార్టీల కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటవుతుంది.` అని చంద్రబాబు చెప్పారు.’సర్’పై రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు శిక్షణ ఇస్తాం. 2024 ఎన్నికల్లో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి ఓటేయడం వల్లే 164 స్థానాల్లో విజయం సాధించగలిగాం. అని అన్నారు. వైసిపిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘గొడ్డలి పార్టీపై అప్రమత్తంగా ఉండాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి..ఓటర్ల జాబితాపైనా ఆ పార్టీతో విషయంలో జాగ్రత్త అవసరం.` అని చెప్పారు. ‘అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు వస్తాయి. ప్రజాప్రతినిధుల ప్రవర్తన కూడా విజయాపజయాలను ప్రభావితం చేస్తుంది. కొత్త ఎంఎల్‌ఎలు వన్‌టైం ఎంఎల్‌ఎలుగా మిగిలిపోవద్దు. మెగా డిఎస్‌సిపై తప్పుడు ప్రచారాలను గట్టి వాదనలతో తిప్పికొట్టాలి` అని అన్నారు. సైకిళ్లపై ఇంటింటి ప్రచారం జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని చంద్రబాబు చెప్పారు… రెండేళ్లల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి. 45 రోజుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టాలి. ఈ ఇంటింటి ప్రచారంలో నేను కూడా పాల్గొంటాను. సైకిళ్ల మీద వెళ్లి ప్రజలను కలవాలి. వీలుంటే ఇ-సైకిళ్లపై ప్రచారం చేపట్టాలి. ప్రధానిగా మోడీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. నేను నాలుగోసారి సిఎంగా ఉన్నాను. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ నెల 21వ తేదీన యోగా డేను అమరావతిలో 25 వేల మందితో నిర్వహిస్తాం. ` అని చంద్రబాబు చెప్పారు.








కామెంట్‌లు (0)