test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరొయ్యకు వడదెబ్బ

31 మే, 2026

aqwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 12:36 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మండుటెండలకు కళ్లు తేలేస్తున్న రొయ్యలు

  • విద్యుత్‌‌ కోతలతో పెరిగిన డీజిల్‌ భారం

  • పంట దిగుబడులు రక్షించుకునేందుకు అవస్థలు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి
ఒకప్పుడు విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదిస్తూ ‘డాలర్ల పంట’గా వెలిగిన ఆక్వా సాగును ప్రస్తుతం కష్టాల సుడిగుండం వెంటాడుతోంది. పెరిగిన మేత ధరలు, మార్కెట్ ఒడిదుడుకులతో ఇప్పటికే సతమతమవుతున్న ఆక్వా రైతులకు.. ప్రస్తుత భానుడి భగభగలు, అప్రకటిత విద్యుత్ కోతలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. కరెంట్ లేక, ఆక్సిజన్ అందక చెరువుల్లోనే రొయ్యలు కళ్లు తేలేస్తుండటంతో రైతాంగం కన్నీరు మున్నీరవుతోంది. వేసవిలో వైరస్ ముప్పు తక్కువగా ఉంటుందని భావించి పెట్టుబడులు పెట్టిన ఆక్వా రైతులకు జూన్ నెల గండంగా మారింది. ఎండ తీవ్రతకు తోడు రోజుకు మూడు నుంచి ఐదు గంటల పాటు విధిస్తున్న విద్యుత్ కోతలు రొయ్యల సాగును నిలువునా ముంచుతున్నాయి. ఆక్సిజన్ అందించే ఏరియేటర్లను నడపడానికి డీజిల్ కొనుగోలు చేయాల్సి రావడంతో గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. పెట్టుబడి ఖర్చులకు తోడు ఈ ఖర్చులు మరింత భారమవుతున్నాయి.

సాగుకు ప్రతికూల పరిస్థితులు

మే నెల ఆరంభంలో వేడి పెద్దగా లేకపోయినా రొయ్యల చెరువులలో 24 గంటలూ ఏరియేటర్లు తిప్పుతూ రొయ్యలకు ఆక్సిజన్‌తో పాటు చల్లదనం అందించారు. అయితే గత పది రోజులుగా ఎండతీవ్రత 45 డిగ్రీలకు తగ్గడం లేదు. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల దెబ్బకు రొయ్యలు ఎర్రగా మారిపోయి వైరస్‌ ‌వచ్చిన రీతిలో చనిపోతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రొయ్యల ఎగుమతులలో అవాంతరాలు ఎదురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌‌పైనే ఆధారపడి ప్రస్తుతం కొనుగోళ్లు సాగుతుండడంతో ధరలు నేల చూపులు చూస్తున్నాయి. దీనికి తోడు సన్‌‌స్ర్టోక్‌ ‌కారణంగా 60-40 కౌంట్‌ ‌రొయ్యలు చనిపోతుండటంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​ఏరియేటర్ల వినియోగంతో రోజుకు 4 కోట్ల భారం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 77,150 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. 30 నుంచి 40 కౌంట్‌ ‌వరకూ రొయ్యలు అమెరికాకు, 50 నుంచి 100 కౌంట్ వరకు చైనా,యూరోపియన్‌ ‌దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన ఖర్చుల నేపధ్యంలో ఎకరాకు రూ.ఐదు లక్షలు పెట్టుబడి వ్యయం అవుతుంది. పంట చేతికొచ్చే నాటికి సుమారు వంద రోజులు పడుతుంది. ప్రస్తుతం అత్యధిక పంట 60 నుంచి 70 రోజుల మధ్యలో ఉంది. రొయ్యలకు మేత, మందులు, ఆక్సిజన్‌ ‌వంటి వాటిలో ఏది కొరత వచ్చినా వైరస్‌ ‌సోకి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఒక ఎకరాకు జనరేటర్‌ ‌ద్వారా ఏరియేటర్‌‌లు ఆడిస్తే గంటకు లీటరు డీజిల్ ఖర్చవుతుంది. ప్రస్తుతం లీటరు డీజిల్‌ ‌రూ.104 కాగా నిర్వహణ ఖర్చు మరో రూ.26 చొప్పున కనీసం రోజుకు నాలుగు గంటల చొప్పున లెక్కిస్తే రూ.520 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన జిల్లాలో రోజుకు నాలుగు కోట్ల రూపాయల అదనపు భారం రైతులపై పడుతుంది.

​విద్యుత్‌ ‌కోతలతో సతమతం : ​వంగ వీరబాబు, ఆక్వా రైతు, కాట్రేనికోన

విద్యుత్‌ ‌కోతలు గోరుచుట్టుపై రోకలి పోటులా మారాయి. విద్యుత్‌ ‌సర్వీసుల మెయింటెనెన్స్‌ ‌పేరుతో గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. కొన్నిసార్లు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ విద్యుత్‌ ‌సరఫరా ఇవ్వడం లేదు. విద్యుత్‌ అంతరాయాలు లేకుండా సరఫరా చేయాలి. రైతులకు కనీస గిట్టుబాటు ధర ప్రకటించాలి.

రొయ్యలను కాపాడుకునేందుకు అవస్థలు : – కె.పెద్దిరాజు, ఆక్వా రైతు, ఎన్‌ ‌కొత్త పల్లి

మార్కెట్లో ఒడిదుడుకులతో పాటు ప్రకృతి వైపరీత్యాలు రొయ్యల పంటల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రొయ్యల గుంటలలో నీరు పూర్తిగా వేడెక్కి పోతోంది. ఈ పరిస్థితులలో ఏరియేటర్లు తిప్పకపోతే రొయ్యలు బతికే పరిస్థితి లేదు. దీంతో భారమైనప్పటికీ దిగుబడలును రక్షించుకునేందుకు అవస్థలు పడుతున్నాం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్