- రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం
- 'మీ భూమి- మీ హక్కు` లో సిఎం చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి - భీమవరం, పెనుమంట్ర : రాష్ట్రంలో సమస్యలు లేని సమాజాన్ని సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించడమే కాకుండా మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అన్ని కులాల సాధికారిత, ఆదాయం, ఆర్థిక పరిపూర్ణతకు కట్టుబడి పని చేస్తున్నామని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ఏర్పాటు చేసిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో సోమవారం చంద్రబాబు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సహా క్యూఆర్ కోడ్ లాంటి పటిష్టమైన చర్యలతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తున్నామన్నారు. 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి... 26.46 లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశామని, మరో 62.32 లక్షల పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని, నిర్దేశిత గడువులోగా వీటిని రైతులకు అందజేస్తామని తెలిపారు. గోదావరి డెల్టా ప్రాంతంలో కాలువలు, చెరువుల మరమ్మతులు, నిర్వహణ సమర్ధవంతంగా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ధాన్యం అమ్మిన తర్వాత ఆరు నెలలు దాకా డబ్బులు పడేవి కాదని, నేడు 24 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో పాటు, ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆక్వా జోన్ పరిధిలోని చెరువులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామన్నారు. దాణా రేట్లు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే రాయితీలు ఇవ్వాలని, సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్రాన్ని కోరామన్నారు. సంక్షేమం- అభివృద్ధి- సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో రూ.20 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వస్తున్నాయని, సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మెగా డిఎస్‌సి నిర్వహించి సుమారు 16,500 మందికి ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించామ న్నారు. పరీక్షలు అంటే తెలియని వ్యక్తులు, రిజర్వేషన్లంటే తెలియని వాళ్లు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం
రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చామని, దీనిలో భాగంగా రీ-సర్వే 2.0 కింద ఇప్పటికే 1,836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి తొమ్మిది లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ తెచ్చామన్నారు. వారసత్వ హక్కుల బదిలీని సులభతరం చేశామని, రూ.పది లక్షల లోపు ఆస్తులకు రూ.100తో బదిలీ చేస్తున్నామన్నారు. అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులకు రూ.1,000 స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. 1బి, అడంగల్, డికెటి, ఇనాం, సీలింగ్ వంటి పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రారంభించామని చెప్పారు. 80 శాతం ఇకెవైసి పూర్తయిన తర్వాతనే గ్రామాలను వెబ్‌ల్యాండ్ 2.0లోకి తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఎ నుంచి తప్పించామన్నారు. 15 జిల్లాల్లోని 33,012 ఎకరాల షరతు గల పట్టా భూములపై ఉన్న ఆంక్షలను తొలగించడం జరిగిందన్నారు.
రాజకీయాలు చేసేందుకు గొడ్డలి పార్టీకి అర్హత లేదు
రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు గొడ్డలి పార్టీకి అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతులు గుర్తుకు రారని, కోడి కత్తి డ్రామాలు ఆడేవాళ్లకు వరి కోతలు ఎలా తెలుస్తాయని, గంజాయి బ్యాచ్‌ను ఓదార్చే వాళ్లకు పంటల సాగు ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత గొడ్డలి పార్టీకి లేదని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, నిరుద్యోగులను క్షమించాలని అడగాలని సూచించారు. అది చేయలేకపోతే ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు గొడ్డలి పార్టీకి అర్హత లేదని విమర్శించారు. కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ర్ట మంత్రులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)