test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై అఖిల‌ప‌క్షం

3 గంటల క్రితం

india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 12:07 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- ఎస్ఐఆర్‌పై సిజెఐకి లేఖ‌
- ఇండియా బ్లాక్ స‌మావేశంలో కీలక నిర్ణయాలు
- ఆగ‌స్టులో హైద‌రాబాద్‌లో త‌దుప‌రి స‌మావేశం
ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు డిమాండ్ చేశారు. సోమ‌వారం నాడిక్క‌డ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా బ్లాక్ స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశానికి 25 ప్రతిపక్ష పార్టీల నుండి 39 మంది నాయకులు హాజరయ్యారు. ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన కీలక సమావేశంలో ‘ఇండియా బ్లాక్‌’ కీలక నిర్ణయాలు తీసుకుంది. నీట్, సిబిఎస్ఇ పరీక్షలకు హాజ‌రైన లక్ష‌లాది మంది యువ‌త‌కు ద్రోహం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు డిమాండ్ చేశారు. ఆయ‌న రాజీనామా కోరుతూ చేస్తున్న నిరసనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణ‌యించారు. ఎన్నికల్లో అవకతవకలు, ఓట్ల దోపిడీ, పారదర్శకత లోపించాయని ఎత్తిచూపుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎస్ఐఆర్‌పై లేఖ రాయాల‌ని నిర్ణ‌యించారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, మ‌హిళ‌లు, అణ‌గారిన తరగతులపై అఘాయిత్యాలు వంటి అంశాలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు మరింత ఐక్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను బహిర్గతం చేయాల‌ని నిర్ణయించారు. ఇండియా బ్లాక్ స‌మావేశం ఇక నుంచి రెండు నెలల‌కోసారి జ‌ర‌పా ల‌ని, తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరపాల‌ని నిర్ణ‌యించారు. ఈ స‌మావేశంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌, జ‌మ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ నేత‌ ఒమర్ అబ్దుల్లా, ఆర్‌జెడి నేత తేజస్వీ యాద‌వ్‌, సిపిఎం రాజ్యసభప‌క్ష నేత జాన్‌ బ్రిట్టాస్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఐ ఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, పిడిపి అధ్యక్షులు మెహబూబా ముఫ్తీ, శివసేన (ఠాక్రే) పక్షనేత సంజయ్ రావత్, ఎన్‌సిపి (శరద్ పవార్) నేత సుప్రియా సూలే, కేరళ కాంగ్రెస్ (ఎం) నేత‌ జోస్ కె మణి, కేరళ కాంగ్రెస్ జోసెఫ్ ఫ్యాక్షన్ నాయకుడు ఫ్రాన్సిస్ జార్జ్, ముస్లిం లీగ్ నాయకులు సాదిక్ షిహాబ్ తంగల్, ఆర్‌ఎస్‌పి నేత ఎన్‌కె ప్రేమ్ చంద్ర‌న్‌, ఎంపి కపిల్ సిబల్, విసికె నేత తిరుమావళవన్, ఎండిఎంకె నేత‌ వైకో, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. జార్ఖండ్ ముఖ్య‌మంత్రి, జెఎంఎం అధ్య‌క్షులు హేమంత్ సోరెన్‌, శివ‌సేన నేత‌లు ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు.

స‌వాళ్ల‌పై ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌
స‌మావేశం అనంత‌రం మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మాట్లాడుతూ.. ఎస్ఐఆర్‌, ఎన్నిక‌ల చోరీపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి త్వ‌ర‌లోనే లేఖ అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. మోడీ ప్ర‌భుత్వం దుష్ప‌రిపాల‌న కార‌ణంగా దేశం ఎదుర్కొంటున్న రాజ‌కీయ‌, ఆర్థిక‌, సామాజిక‌, విదేశాంగ విధాన స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌తిప‌క్ష నేత‌లంతా ఐక్యంగా ఉన్నార‌ని అన్నారు. లోక్‌స‌భ‌లో ఎలాగైతే డీలిమిటేష‌న్ బిల్లును ఎదుర్కొన్నామో అదే స్ఫూర్తితో మ‌రింత బ‌లోపేతం చేసుకుని ముందుకు సాగాల‌ని సూచించారు. రాజ్యాంగంపై దాడి కొన‌సాగుతోంద‌ని, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను వేధించ‌డానికి, భ‌య‌పెట్ట‌డానికి, బెదిరించ‌డానికి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను నిరంత‌రం సాధ‌నాలుగా వాడుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. దేశ ఆర్థిక ప‌రిస్థితి అత్యంత ప్ర‌తికూలంగా ఉంద‌ని, కొత్త ఉద్యోగాలను సృష్టించ‌డానికి అవ‌స‌ర‌మైన వేగంతో కొత్త పెట్టుబ‌డులు రావ‌డం లేద‌ని అన్నారు. దేశంలో ప‌రీక్షా విధానంలో పూర్తిస్థాయి దుర్వినియోగం కార‌ణంగా ల‌క్ష‌లాది యువ‌త ఆశ‌లు, ఆకాంక్ష‌లు దెబ్బ‌తింటున్నాయ‌ని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల ఓటు హ‌క్కును హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. బిజెపియేత‌ర ప్ర‌భుత్వాల‌పై వివ‌క్ష చూపుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిప‌త్యాలు పెరుగుతున్నాయ‌ని, ఎంఎస్ఎంఇల భ‌విష్య‌త్తు తీవ్ర సంక్షోభంలో ఉంద‌ని పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో బ‌ల‌హీనవ‌ర్గాల‌పై అఘాయిత్యాలు నిర్విరామంగా కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. మ‌న విదేశాంగ విధానం పూర్తిగా దెబ్బ‌తింద‌ని, ఇండియా ఎప్పటి నుంచో దృఢంగా స‌మ‌ర్థిస్తున్న సంప్ర‌దాయ విలువ‌ల‌ను నిల‌బెట్ట‌లేద‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ వైఖ‌రిపై నిల‌దీత‌
బిజెపికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డిన‌ ప్రతిపక్ష కూటమిని కాంగ్రెస్‌ బలహీనపరుస్తుంద‌ని ప‌లు పార్టీలు విమ‌ర్శించాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్‌ సమావేశంలో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. కాంగ్రెస్ సంకుచిత రాజకీయ ప్రయోజనాలపై వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జెడి వంటి పార్టీలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం కేంద్ర సంస్థలను ఆయుధాలుగా ఉపయోగించినప్పుడు ఇండియా బ్లాక్‌ ఐక్యంగా నిలబడాలని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ సమస్యపై ఇండియా బ్లాక్‌ ఒకే వైఖరిని అవలంబించాలని ఆయా పార్టీల నేత‌లు డిమాండ్ చేశారు.

పవ్చి అబద్ధాలు ప్రచారం చేశారు : కాంగ్రెస్‌‌పై బ్రిట్టాస్‌ ఆగ్రహం
కేరళ ఎన్నికల సమయంలో వామపక్షాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ నాయకులు చేసిన నిరాధార ప్రచారాన్ని సిపిఎం రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ ఎత్తి చూపారు. వామపక్షాలకు, బిజెపికి మధ్య రహస్య అవగాహన ఉందని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నాయకులు పచ్చి అబద్ధం ప్రచారం చేశారన్నారు. ‘బిజెపిని అధికారానికి దూరంగా ఉంచడానికి వామపక్షాలు కఠిన వైఖరి వల్లే మొదటి యుపిఎ ప్రభుత్వం ఏర్పడింది. రాహుల్ గాంధీ ఆ చరిత్రను కప్పిపుచ్చి, వామపక్షాలకు, బిజెపికి మధ్య ఒక ఒప్పందం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. వామపక్షాల బిజెపి వ్యతిరేక వైఖరికి కాంగ్రెస్ సర్టిఫికెట్ అవసరం లేదు’ అని జాన్ బ్రిట్టాస్ సమావేశంలో అన్నారు. ‘వామపక్షం ఇకపై వామపక్షం కాదు’ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యను సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు. దీనికి కలత చెందిన రాహుల్ గాంధీ, తాను ఆ వ్యాఖ్యను వాస్తవాల ఆధారంగానే చేశానని బదులిచ్చారు. మీ వద్ద ఉన్న వాస్తవాలు ఏమిటని వామపక్ష నాయకులు ప్రశ్నించారు. అదానీని కేరళకు తీసుకొచ్చింది ఎల్‌డిఎఫ్ అని, ఇది ఒప్పందంలో భాగమని రాహుల్ చెప్పారు. మీ అవగాహన తప్పు అని, అదానీని కేరళకు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వామపక్ష నాయకులు గుర్తుచేశారు. దీని తరువాత, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్.. కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. డిఎంకె, ఆప్ దూరంగా ఉండటం పెద్ద ఎదురుదెబ్బ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఇదే పద్ధతిలో కొనసాగాలా వద్దా అనే దానిపై తీవ్రంగా పరిశీలించాలని కూడా అఖిలేష్ డిమాండ్ చేశారు. బీహార్‌లో కాంగ్రెస్, బిజెపి నాయకుల మధ్య అనేక విషయాలపై రహస్య అవగాహనలు ఉన్నాయని తేజస్వి యాదవ్ అన్నారు. ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో చాలాసార్లు ప్రస్తావించానని, అయినప్పటికీ, దానిని సరిదిద్దడానికి వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఇండియా బ్లాక్ సమావేశానికి ముందు ఢిల్లీలోని అనేకచోట్ల కాంగ్రెస్, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్