సిఎం చంద్రబాబు సహా పలువురు సంతాపం
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో, ఉక్కునగరం : విశాఖ ఉక్కు కర్మాగారంలో ఆదివారం సాయంత్రం ఊహించని మహా విషాదం సంభవిం చింది. స్టీల్ మెల్టింగ్ షాప్-1 (ఎస్‌ఎంఎస్-1) లోని కంటిన్యూయస్ క్యాస్టింగ్ డిపార్ట్‌మెంట్ (సిసిడి) మిషన్-2 వద్ద 150 టన్నుల ద్రవరూప ఉక్కును తరలిస్తుండగా ల్యాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది. సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన ద్రవ ఉక్కు ఒలకడంతో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ద్రవరూప ఉక్కును ల్యాడిల్ ద్వారా తరలిస్తున్న సమయంలో ఈ బ్లాస్ట్ జరిగినట్లు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రాథమిక సమాచారంగా తెలిపారు. మ్యాన్ పవర్ తగ్గించి, కార్మికులపై అడ్డగోలుగా పనిభారం మోపడం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... సాయంత్రం 4.15 గంటల సమయంలో ద్రవ ఉక్కును తరలిస్తున్న ల్యాడిల్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. వేడెక్కిన మెటల్ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. పేలుడు శబ్దం కిలోమీటరు వరకూ వినిపించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు రెగ్యులర్ ఉద్యోగులు, ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు మృతిచెందారు. మృతుల్లో గొంతిన భాను కుమార్ (టెక్నీషియన్), జివి.అప్పారావు, ఎం.కృష్ణనాగు, కె. ప్రభాకర్ (జనరల్ ఫోర్‌మ్యాన్), జి.కుమార్ (మేనేజర్, మెకానికల్-2 ఇన్‌చార్జి), కాంట్రాక్టు కార్మికులు రమణ, త్రినాథ్, ఎన్. అప్పలరాజు ఉన్నారు. గాయపడ్డ బి.సత్యనారాయణ, పి.శ్రీనివాసరావు, పైడిరాజు, సూరిబాబులకు విశాఖ నగరంలోని పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సూరిబాబు శరీరం 90 శాతం కాలిపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, భద్రతా బృందాలు, అత్యవసర స్పందన దళాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి. ఘటనపై సిఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు, క్షతగాత్రుల పరిస్థితిని అధికారులు వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని అన్నారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలకు సూచించారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన హోం మంత్రి అనిత
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఉద్యోగులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికిగల కారణాలపై ప్లాంట్ యాజమాన్యం, భద్రతా విభాగం, సాంకేతిక నిపుణులు సంయు క్తంగా విచారణ చేపట్టారు. ల్యాడిల్ పేలడానికి దారితీసిన సాంకేతిక లోపాలు, నిర్వహణలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల అమలులో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. కార్మిక సంఘాలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ చరిత్రలోనే 2012లో జరిగిన ప్రమాదంలో 12 మంది మరణించిన తర్వాత ఈ సంఘటన అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ప్రభుత్వ విధానాలతోనే వరుస ప్రమాదాలు
స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు చేయని కుట్ర లేదు. కార్మికుల సంఖ్య తగ్గించడం, భద్రతను గాలికొదిలేయడం, పలు విభాగాల్లోని యంత్రాల మెయింటెనెన్స్ చేయకపోవడం, విభాగాలను బడా కాంట్రాక్టు కంపెనీలకు అప్పగించడం వంటి చర్యలతో ప్రమాదాలకు నిలయంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ మారింది. ఆరు వేల మంది కాంట్రాక్టు కార్మికులను గతేడాది అమానవీయంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తొలగించాయి.
మోడీ, చంద్రబాబు బాధ్యత వహించాలి : సిపిఎం
స్టీల్ ప్లాంట్ లో జరిగిన భారీ ప్రమాదానికి మోడీ, చంద్రబాబు ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యమే కారణమని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు. ప్రయివేటీకరణ విధానాల వల్లనే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి చొప్పున పరిహారం, కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.








కామెంట్‌లు (0)