test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై న్యాయ విచారణ

3 గంటల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘోర ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు రూ.5 కోట్లు చొప్పున పరిహారం చెల్లించాలని సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.  జూన్ 8న   సాయంత్రం 4:30 గంటలకు ఎస్‌ఎంఎస్-1 విభాగంలోని మిషన్-2 వద్ద జరిగిన లాడెల్ బ్లాస్టింగ్ ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారని సిఐటియు తెలిపింది. మృతుల్లో 5 మంది శాశ్వత ఉద్యోగులు, 3 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, ప్రమాద తీవ్రత కారణంగా కొందరి మృతదేహాలు గుర్తించలేని స్థితికి చేరాయని పేర్కొంది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. నరసింగరావు, ప్రధాన కార్యదర్శి ఏ.వి. నాగేశ్వరరావు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో, విశాఖ స్టీల్ చరిత్రలో ఇంతటి ఘోర ప్రమాదం ఎన్నడూ జరగలేదని తెలిపారు. సుమారు 140 టన్నుల లిక్విడ్ స్టీల్‌తో పనిచేస్తున్న లాడెల్‌లో ప్రమాదం సంభవించిందని, దీనికి యాజమాన్యం నిర్వహణ లోపాలు, మెయింటెనెన్స్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలిపారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కాకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్లాంట్ సీఎండీపై బాధ్యత నిర్ధారించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలోని ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ  డిమాండ్ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్