@పలు చోట్ల ఇరాన్, ఇజ్రాయిల్ దాడులు
@లెబనాన్‌పై పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు
@నిర్ణయాలు తనవేనన్న ట్రంప్
@ఇజ్రాయిల్‌పై హౌతి రెబెల్స్ దాడులు
టెహ్రాన్, జెరూసలేం, వాషింగ్టన్ : పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై సోమవారానికి వంద రోజులకు చేరింది. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్ళీ పూర్తి స్థాయిలో ఇరు పక్షాల మధ్య యుద్ధం చెలరేగే ప్రమాదం కనిపిస్తోంది. ఇజ్రాయిల్, ఇరాన్‌లు సోమవారం తెల్లవారు జామున పరస్పరం దాడులు జరుపుకున్నాయి. సెంట్రల్, పశ్చిమ ఇరాన్‌లపై ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఇరాన్ నుండి వచ్చిన క్షిపణి దాడికి ప్రతిగా తామీ వరుస దాడులకు పాల్పడినట్లు తెలిపింది. ఇరాన్ నుండి వస్తున్న క్షిపణులను అడ్డుకునేందుకు ఇజ్రాయిల్ తన వైమానిక రక్షణ బలగాలను ఉపయోగించింది. సెంట్రల్ ఇజ్రాయిల్‌లో కొన్ని పేలుళ్ళు వినిపించాయి. రెండు మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్‌జిసి బలగాలు ప్రకటించాయి. ఆపరేషన్ విక్టరీలో భాగమే ఈ దాడులని వ్యాఖ్యానించింది. ఇరాన్‌లో మూడు చోట్ల రాడార్ కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు జరిపినందుకే ఈ ప్రతీకార దాడులని పేర్కొంది. వాయవ్య ఇరాన్‌లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో అనేక లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్ మిలటరీ సోమవారం ప్రకటించింది. ఇరాన్‌లో వ్యూహాత్మక రక్షణ వ్యవస్థను, దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని తెలిపింది. దాడుల నేపథ్యంలో టెహరాన్‌లో ఖమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాలను ఇరాన్ మూసివేసింది. ప్రస్తుత దాడులకు అమెరికానే కారణమని వ్యాఖ్యానించింది. ఇజ్రాయిల్ చర్యలను అమెరికా విధానం నుండి వేరు చేసి చూడలేమని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘె పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇజ్రాయిల్‌పై యెమెన్ హౌతి రెబెల్స్ కాల్పులు జరిపారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్‌కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ముప్పు పొంచి వుంది. ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదం లేదు. అక్కడ ఇజ్రాయిల్ పదాతి దాడులతో సహా అన్ని రకాల దాడులను ఉధృతం చేసింది. ఇరాన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికాతో కుదిరే ఏ కాల్పుల విరమణ ఒప్పందమైనా లెబనాన్‌లోకూడా యుద్ధం ఆగాలని కోరుతోంది. ఇజ్రాయిల్ ఇందుకు ఒప్పుకోవడం లేదు.
తక్షణమే కాల్పులు ఆపండి : ట్రంప్
ఈ దాడులపై వైట్‌హౌస్ స్పందించలేదు. అమెరికా సమన్వయంతోనే ఈ దాడులు జరుగుతున్నాయా లేదా అన్నది కూడా తెలియరాలేదు. ఇరాన్ క్షిపణి దాడులకు వెంటనే స్పందించవద్దని ట్రంప్, నెతన్యాహును కోరారని, కానీ నెతన్యాహు కార్యాలయం నుండి దీనిపై ఎలాంటి స్పందన లేదని సీనియర్ అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. అంతకుముందు ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, లెబనాన్‌పై దాడుల విషయంలో ఇజ్రాయిల్ తీరు నచ్చడం లేదని చెప్పారు. నిర్ణయాలు తీసుకునేది తానేనని, ఇజ్రాయిల్ కాదని ఆయన స్పష్టం చేశారు. నెతన్యాహుకు ఎలాంటి చాయిస్ వుండబోదని అన్నారు. ఇరాన్ కూడా దాడులు ఆపి, చర్చా వేదిక వద్దకు రావాలన్నారు. ఇరు పక్షాలు తక్షణమే కాల్పుల ఆపాలంటూ ట్రంప్ సోమవారం సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.
చైనా ఆశాభావం
ఇరాన్, ఇజ్రాయిల్‌లు కాల్పుల విరమణ పాటించాలని చైనా కోరింది. సోమవారం తాజా దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో గౌరవించి, అమలు చేయాలని కోరింది. ఘర్షణలు ఇలా కొనసాగడం ఎవరికీ మంచిది కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ విలేకర్లతో వ్యాఖ్యానించారు.







కామెంట్‌లు (0)