test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మడకశిరలో విషాదం: వంక ప్రవాహంలో కొట్టుకుపోయి మహిళ మృతి

1 గంట క్రితం

death body
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 10:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తమ్ముడు సురక్షితం

 ప్రజాశక్తి-మడకశిర (శ్రీ సత్యసాయి) జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి స్థానిక వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక మహిళ మృతి చెందింది. మడకశిర పట్టణ పరిధిలోని బేగార్లపల్లి క్రాస్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కాతమ్ముళ్లిద్దరూ కలిసి బైక్‌పై వెళ్తుండగా, బేగార్లపల్లి క్రాస్ వద్ద రహదారిపై వంక నీరు అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నీటి వేగానికి బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి ఇద్దరూ వరద నీటిలో పడిపోయారు. తమ్ముడు దివాకర్ ఎలాగోలా ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా.. అక్క గీతమ్మ (40) మాత్రం నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి చీకటిగా ఉన్నప్పటికీ లైట్ల సహాయంతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం వంక దిబ్బల్లో, మట్టిలో పేరుకుపోయిన స్థితిలో గీతమ్మ మృతదేహం లభ్యమైంది.విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్సీ గుడిమల తిప్పేస్వామి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, గీతమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్టసమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్