అయిదు రాష్ట్రాలు – ఒకే హెచ్చరిక

అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే ముగిశాయి. భారతదేశ భిన్నత్వానికి అద్దం పడుతూనే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ దుస్తంత్రాలకు విస్తరిస్తున్న బిజెపి, ఆరెస్సెస్‌ అప్రజాస్వామిక వ్యూహాలనూ ప్రజలకు తెలియజెప్పాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు, తదనంతర నాటకీయ పరిణామాలపై దృష్టి కేంద్రీకృతమవడం సహజమే. అయినా కేరళలో యుడిఎఫ్‌ గెలుపు, పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారి బిజెపి పగ్గాలు చేపట్టడం ఆధారంగా కమ్యూనిస్టు వ్యతిరేకతను పెంచేందుకు కొన్ని శక్తులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. తెలుగు రాష్ట్రాల పాలక పార్టీలు కూడా తమ తమ కోణాల నుంచి పలు రకాలుగా స్పందిస్తున్నాయి. రాజకీయాలు అలా వుంచితే రాజ్యాంగ పరంగానూ సర్‌ తతంగం పర్యవసానాలు, పోలింగ్‌ కౌంటింగ్‌ వివాదాలు కూడా నాటకీయతకు దారితీశాయి. జయాపజయాలు అలా వుంచితే వివిధ ప్రాంతీయ పార్టీలు ఏ దిశ తీసుకోవాలో మల్లగుల్లాలు పడుతున్న తీరునూ వెల్లడించాయి. ఇది ఇటీవలి కాలంలో బహుశా ఏ ఎన్నికల తర్వాత లేని సన్నివేశంగా చెప్పక తప్పదు.

2024లో మోడీ హవా దెబ్బ తిని, బిజెపి స్వంతంగా మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలోనే ఈ ఫలితాలను చూడవలసి వుంటుంది. ఆ తర్వాత జరిగిన బీహార్‌, హర్యానా, మహారాష్ట్రలతో సహా వివిధ ఎన్నికలలో బిజెపి విజయం సాధించింది. ఒక విధంగా మోడీ జోరు అప్రతిహతంగా సాగుతున్నదనే భావన కొనసాగించేందుకు పెద్ద ఎత్తునే ప్రయత్నం జరిగింది. కానీ వాస్తవ తీర్పులూ, జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక సవాళ్లు దీనికి మరోవైపు ఏమిటో చూపిస్తూనే వస్తున్నాయి. కనుకనే నేరుగా ఎన్నికల ప్రక్రియను తారుమారు చేసే ఎత్తుగడలకు కేంద్రం పాల్పడింది. బీహార్‌లో మొదలైన సర్‌ ప్రక్రియ బెంగాల్‌, తమిళనాడులలో పరాకాష్టకు చేరింది. అస్సాంలో మరో విధంగా మతపరమైన విభజనకు విష బీజాలు నాటింది. ఫలితాలు అందుకు తగినట్టే వున్నాయన్నది నిపుణులు, పరిశీలకులు చెబుతున్న మాట. అనేక దేశాలతో పాటు మన దేశంలోనూ మితవాద, మతవాద రాజకీయ భావజాలం పెరుగుదలను ఈ ఫలితాలు వెల్లడిచేశాయి. వాటిపై ప్రజల ప్రతిస్పందన వున్న మేరకు కూడా వ్యక్తం కాకుండా రాజ్యాంగ యంత్రాన్ని ఆర్థిక రాజకీయ ఆధిపత్యాలను వ్యూహాత్మకంగా దుర్వినియోగం చేసిన తీరు, వాటిపై న్యాయ వ్యవస్థ సకాలంలో నివారించకపోవడం కూడా ఈ ఫలితాల వెనక వుంది.

కేరళంతో ఖతమా?

అన్ని చోట్లా దెబ్బ తింటున్న కాంగ్రెస్‌ పార్టీ కేరళంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించడమే ఏకైక లక్ష్యంగా అన్ని రకాల ఎత్తుగడలకు పాల్పడింది. బిజెపి కూడా ఇతరులను కలుపుకొని తన వంతు పాచికలు వేసింది. మత సమస్యలతో సహా రగిలించే ప్రయత్నాలు చేసింది. ఇన్నిటి మధ్యనా సిపిఎం-ఎల్‌డిఎఫ్‌ ఇటీవలి స్థానిక ఎన్నికలతో పోలిస్తే కాస్త గట్టి పోటీనే ఇచ్చింది. నిజానికి రెండవసారి మళ్లీ వచ్చినప్పుడే ఎల్‌డిఎఫ్‌ రికార్డు సృష్టించింది గనక మూడోసారి రావడం తేలిగ్గా జరగదని కేరళం చరిత్ర చెబుతూనే వుంది. అయినా మంత్రుల ఓటమి, ఊహించిన దానికన్నా తేడా ఎక్కువగా వుండటం ప్రత్యేకంగా పరిశీలించుకోవలసినవి. గతంలో బెంగాల్‌లో చేసినట్టే కేరళంలో కూడా విజయాలు విజయన్‌ ప్రత్యేకతగా ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు ఓటమిని కూడా ఆయనకే అంటకట్టడం విధానపరమైన అంశాలను పక్కదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే. కోవిడ్‌తో సహా అన్ని విషయాల్లోనూ ఆ ప్రభుత్వ సానుకూల విజయాలను ఎవరూ కాదనలేదు. అదే రీతిలో లోపాలేమిటో కూడా తప్పక చర్చ జరుగుతుంది. కాకపోతే ఫలితాలకు ముందు నుంచి కేరళంలో కమ్యూనిస్టులు ఓడిపోతే వామపక్షాలకు చోటే వుండదన్నట్టు ప్రచారం చేస్తూ వచ్చారు. నిజానికి మూడు రాష్ట్రాలలో పది కోట్ల మందిని వామపక్షాలు పాలించిన రోజున ఘనంగా చెప్పిందేమీ లేదు. అప్పుడు కూడా ఇలాగే కేరళం, బెంగాల్‌కు పరిమితమని చప్పరించేవారు. వాస్తవం ఏమంటే ఎన్నికల రంగంలో ఎవరూ శాశ్వతంగా గెలవరు. కేరళంలో గతంలోనూ చాలా గెలుపు ఓటములు వున్నాయి. అంతేగాని ఖతం వంటివేమీ జరగలేదు. ఆ మాటకొస్తే మొదటి ఇఎంఎస్‌ ప్రభుత్వాన్నే నిరంకుశంగా తొలగించినా ఇప్పటికీ బలమైన కమ్యూనిస్టు ఉద్యమం, సిపిఎం కీలక స్థానం చెక్కు చెదరలేదని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిని ఎంచుకోవడానికి కుస్తీలు పడుతున్న తీరు ఇందుకు పూర్తి భిన్నం.

బెంగాల్‌ దంగల్‌

బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పడటం తమ అతి పెద్ద విజయంగా బిజెపి చెప్పుకుంటుందంటే కమ్యూనిస్టులపై దాని కరుడుగట్టిన వ్యతిరేకత, ద్వేషం కళ్లకు కడతాయి. దాదాపు కోటి ముప్పై లక్షల ఓట్లు నిర్దేశిత సీట్లలో తొలగించి కేంద్ర సంస్థలను మోహరించి, ఇ.సి ని కూడా దించి సాధించిన ఈ విజయం గర్వకారణమేమీ కాదు. అరాచక అవినీతి పాలనతో మాఫియా రాజ్యం సాగించిన మమతా బెనర్జీ ఇందుకు బాధ్యత వహించవలసి వుంటుంది. సిపిఎం ను అక్కడ దెబ్బ తీయడానికి కాంగ్రెస్‌, బిజెపి రెండూ మమత నుంచి, మావోయిస్టుల వరకూ అందరినీ వినియోగించాయని మర్చిపోరాదు. దాన్ని వెంటనే పున:ప్రతిష్టించడం సిపిఎం కార్యకర్తల మనో నిబ్బరాన్ని వెల్లడిస్తుంది. ఇప్పుడు సి.ఎం సువేందు అధికారి కూడా మమత కుదురు నుంచి వచ్చిన మాజీ కుడి భుజమేనన్నది వాస్తవం. శారదా చిట్‌ కుంభకోణంలో భాగస్వామి కూడా. బిజెపి నాయకత్వంలో కీలక నేతలు చాలా మంది గతంలో టిఎంసిలో వున్నవారే. మూడున్నర దశాబ్దాల అప్రతిహత పాలనలో ప్రజానుకూల పాలనతో పాటు పొరబాట్లు కూడా వుండటం సహజమే. వాటని సిపిఎం ఏనాడూ నిరాకరించలేదు. అయితే ఆ ప్రభుత్వాన్ని, వామపక్షాలను దెబ్బతీసేందుకు అభివృద్ధి నిరోధకుల కుట్రలు అనేకం జరిగాయన్నది కూడా గుర్తుంచుకోవాలి. బెంగాల్‌లో కూడా కాంగ్రెస్‌ బిజెపి ని నిరోధించేందుకు విస్త్రుత ఐక్యత అవసరాన్ని గుర్తించకుండా ఓట్ల చీలికకు కారణమైంది. ఇప్పుడు చూస్తే సర్‌ జరిగిన 105 స్థానాల్లో బిజెపినే గెలిచింది. ఇందులో 88 ఏనాడూ ఆ పార్టీ గెలిచి ఎరగనివే. ఇక మరో 80 పైగా స్థానాల్లో ఓట్ల చీలికే ఇందుకు దోహదం చేసింది. అంటే గెలిచిన వారికి వచ్చిన మెజారిటీ కంటే మూడో స్థానంలో వారి ఓట్లే ఎక్కువ. వామపక్ష ఫ్రంట్‌ ఒంటరిగా పోటీ చేసినా గతసారి వచ్చిన ఓట్లే ఇంచుమించుగా రావడం గమనించదగింది. ఈ కాలంలో దాదాపు 800 మంది కార్యకర్తలు దారుణ హత్యకు గురైనా ధైర్యంగా నిలబడటం గొప్ప విషయం. ఫలితాల తర్వాత మమత నాటకాలు షరామామూలుగా సాగినా సీనియర్‌ నాయకులు మాత్రం బిజెపి విజయంలోని విపత్తును ఎదుర్కోవాలని దృఢంగా పిలుపునిస్తున్నారు. గతంలో త్రిపురలో వలెనే ఇప్పుడు బెంగాల్‌లోనూ వచ్చిన రోజునే లెనిన్‌ విగ్రహాన్ని కూల్చడం బిజెపి వారి నిజస్వరూపం చెబుతుంది. కమ్యూనిస్టులు ఖతం కారని చాటుతుంది.

తమిళనాడు తకరారు

తమిళనాడులో నటుడు విజరు టివికె 107 స్థానాలతో పెద్ద పార్టీగా రావడం ఊహించనిదే. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహా ఓడిపోవడం చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత బాగానే వుందని తెలుస్తుంది. అన్నా డిఎంకెకి అసలే మద్దతు లేదు. అయితే ఈ పరిస్థితులో విజయ్ ని తమిళ ఓటర్లు ఎన్నుకోవడంలో మతతత్వ రాజకీయాలకు పరోక్ష సమాధానం కనిపిస్తుంది. ఎ.పి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వంటి వారితో సహా సనాతనం అని ఊగిపోయిన వేళ ఆ చర్చ మొదలైన తమిళనాట బిజెపి కూటమి మూడో స్థానానికి నెట్టబడటం దక్షిణాది రాజకీయాల ప్రత్యేకత చెబుతుంది. ఇక్కడ కూడా సర్‌ ప్రభావం పని చేసిందని చెప్పక తప్పదు. దాంతోపాటు డిఎంకె-కాంగ్రెస్‌ అనైక్యతతో కమ్యూనిస్టులు సీట్లు తగ్గించుకుని మరీ నిలబడటం గమనించదగింది. ఓట్ల లెక్కింపునకు ముందే విజరుకి హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసినా ఆయన వారితో కలవడానికి నిరాకరించారు. వెంటనే ఆహ్వానించి అవకాశమివ్వకుండా నడిపించిన కపట నాటకాలకు ఇదే కారణమైందనుకోవాలి. ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్‌ వెంటనే టివికెకు మద్దతు తెలపగా వామపక్షాలు సమయం తీసుకుని ఐక్యత కాపాడుతూనే బయిట నుంచి బలపరుస్తామని ప్రకటించాయి. అయినా డిఎంకె కాంగ్రెస్‌ ద్రోహం చేసిందంటూ లోక్‌సభలో కూడా సీట్లు మార్చుకోవాలని నిర్ణయించింది. రెండు డింఎకెలు దగ్గర కావాలని చూడటం కూడా ప్రాంతీయ పార్టీల స్థానిక అధికార దృష్టినే వెల్లడిస్తుంది. మొత్తం పైన దక్షిణాదిన బిజెపి నేరుగా పాలించే రాష్ట్రం లేకుండా పోవడం కీలక అంశం. ఎ.పి లో కూటమి పేరిట చంద్రబాబు నాయుడు వారికి అవకాశం కల్పించి వుండకపోతే ఎ.పి లోనూ చోటుండేది కాదేమో. మరో వంక ఈ ఫలితాల వెను వెంటనే మోడీ హైదరాబాద్‌ రావడం తెలంగాణ టార్గెట్‌గా ప్రకటించడం కూడా వ్యూహాత్మకమే. తమలో తాము పోట్లాడుకోవడంలో మునిగితేలుతున్న కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లు ఈ ప్రమాదాన్ని గుర్తిస్తాయా అనేది ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేరళలో చేసిన ప్రసంగాలూ తర్వాతి వ్యాఖ్యలు ఆ స్ఫూర్తికి అనుగుణంగా లేకపోవడం ఆందోళనకరమే. కేరళతో ఖతమైపోయారన్న కమ్యూనిస్టులే తమిళనాడులో కీలక పాత్రధారులు కావడం యాదృచ్ఛికం కాదు.

అస్సాం మళ్ళీ కైవశం

అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని బిజెపి కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో ఎక్కువ చర్చ జరగలేదు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో, నిరుద్యోగం, శాంతి భద్రతల వైఫల్యంతో పాటు బిజెపి నేతల అవినీతి చెలరేగిపోయింది. ముఖ్యమంత్రి కుటుంబం పైనే ఆరోపణలు నడిచాయి. కాంగ్రెస్‌ నుంచి బిజెపి లోకి దూకిన హిమంత మత విద్వేషం చిమ్మారు. అయినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు. పోలింగ్‌కు బాగా ముందే లక్షల సంఖ్యలో మైనారిటీ ఓట్లు తొలగించింది. తక్కిన చోట్ల ఎస్‌ఐఆర్‌ ప్రయోగించి ఇక్కడ ఎస్‌.ఆర్‌ అంటూ బిజెపి అభీష్టానుసార సామూహిక తొలగింపులకు పాల్పడింది. బిజెపి బెంగాలీ ముస్లింలను విదేశీ చొరబాటుదార్ల ముద్రతో వేధించింది. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ దీటుగా ఎదుర్కోలేక చతికిలపడింది. లౌకిక ఎజెండాతో స్పష్టంగా ముందుకొచ్చి అందరినీ కలుపుకుపోవడానికి బదులు ఏకపక్ష ధోరణితో ఉన్న సీట్లు కూడా కోల్పోయింది. అలా ఓట్ల చీలికలతో వామపక్షాలు కూడా వున్న బలం కోల్పోయి ప్రాతినిధ్యం కరువైంది. ప్రభుత్వం విదేశీయులంటూ పౌరులను తమ దేశంలోకి తరలించబోదని ఆశిస్తున్నామని బంగ్లాదేశ్‌ ప్రతినిధి చెప్పడం గతంలో ఎప్పుడూ చూడనిది. పోలింగ్‌ సమయంలోనూ ఎన్నికల సంఘం పూర్తి పక్షపాతం వహించింది. ఆ విధంగా అస్సాం నమూనా చాలా ప్రమాదకర సంకేతాలిస్తున్నది. జాతి మత వివాదాలు, అంతర్జాతీయ కోణాలు కలిగిన అస్సాం పరిణామాలను జాతీయ మీడియా ఉపేక్షించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరిపాలన బాగుంటే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారని కితాబిచ్చేవారు ఈ వాస్తవాలు చూడవలసి వుంటుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి రంగస్వామి తిరిగి రావడం ఊహించినదే.
ఏమైనా ఎన్నికలలో విజయం లభిస్తే గొప్ప, ఓడిపోతే తక్కువ అనే భావన సరైంది కాదు. ఎన్నికల పోరాటం దీర్ఘకాల ప్రజా రాజకీయాలలో ఒక భాగమే. ఇప్పుడు ధనబలం కులమత ప్రాబల్యం, మీడియా మాయాజాలం సర్‌ వంటి రాజ్యాంగ కుట్రలూ వాటిని మరింత జటిలం చేశాయని తాజా ఫలితాలు మరోసారి నిరూపిస్తున్నాయి.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి