మ్యూజికల్ కీబోర్డు మీటల సాయంతో శబ్దాలను, సరికొత్త బాణీలతో సంగీతాన్ని అందిస్తూ ఈ కుర్రోడు అద్భుతాలు చేస్తున్నాడు. పియానో, డ్రమ్స్, గిటార్ వంటి ఎన్నో వాయిద్యాల శబ్దాలను కీబోర్డు ద్వారా ఒకే పరికరంతో పలికిస్తూ పాశ్చాత్య, కర్ణాటక, సినీ సంగీతంలో శ్రావ్యమైన సంగీత మధురిమలు సృష్టిస్తున్నాడు. అంతే కాదు; కీబోర్డు మీదనే జోరు వర్షం, గుర్రం పరుగు, రైలు బండి శబ్దం, కారొచ్చి ఆగడం, ఉరుము, మెరుపుల శబ్దాలు, యుద్ధ సన్నివేశాలు, విధ్వంసాలు, బాంబు శబ్దాలు… ఇలా అనేకం వినిపిస్తూ, సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నాడు. వినోదాన్నైనా, విషాదాన్నైనా, ఎలాంటి శబ్దాలైనా క్షణకాలంలో వచ్చేలా చేస్తున్నాడు. ఫాస్ట్ బీటైనా.. ఓల్డ్ డ్యూయెట్‌కైనా లేటెస్ట్ కీబోర్డుతో శ్రావ్యమైన సంగీత విందును అందిస్తున్న ఈ విజయవాడ కుర్రోడు పేరు కొక్కిరిగడ్డ నీరజ్.
విజయవాడ మొగల్రాజపురం సమీపంలోని న్యూగిరిపురం ఢిల్లీకోటమ్మ వీధికి చెందిన కొక్కిరిగడ్డ స్టాలిన్, వేల్పుల సునీత దంపతుల కుమారుడు కొక్కిరిగడ్డ నీరజ్ 2010, ఫిబ్రవరి 2న జన్మించాడు. ప్రస్తుతం విజయవాడలోని లయోల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం MPC చదువుతున్నాడు. సంగీతంపై చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకున్న నీరజ్ క్రమశిక్షణతో సాధన చేస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. చదువుతో పాటు సంగీతానికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నాడు. తండ్రి కొక్కిరిగడ్డ స్టాలిన్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ తన కుమారుడి ప్రతిభను ప్రోత్సహిస్తున్నాడు. నీరజ్‌కు చిన్నప్పటి నుంచే ఆటలన్నా, సంగీతం వినటం, పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం. రేడియోలోనూ, టీవీల్లోనూ వచ్చే పాటలు వినగానే గుర్తుపెట్టుకోవటం అతనికి కలిసొచ్చిన విషయం. పాటలు పాడటం, సంగీత పరికరాల వాయిద్యాలను ప్రత్యేకంగా ప్రోది చేసుకుని వింటుండటం హాబీగా ఏర్పర్చుకున్నాడు. పాఠశాల, కళాశాలస్థాయిలో జరిగిన ఈవెంట్లలో తను ప్రత్యేకంగా కీబోర్డు ప్లే చేసి పాటలు పాడటం, పాట పాడేవారికి వాయిద్య సహకారాన్ని అందించేవాడు. ఇలా చేసే కృషి, ప్రాక్టీస్ కీబోర్డు వాయిద్యంలో సరికొత్త బాణీలు నేర్చుకోవటానికి, కనిపెట్టడానికి దోహదపడింది. సంగీత కార్యక్రమాల్లో నీరజ్ ప్రతిభను గుర్తించిన ఎందరో ప్రముఖులు అభినందనలు తెలియజేసి మరింత ప్రాక్టీస్ చేస్తే నిపుణుడిగా మారవచ్చని ఇచ్చిన ప్రోత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో కృషి చేస్తున్నాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం
చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న నీరజ్ కీబోర్డ్ వాయిద్యంలో ప్రతిభ కనబరిచి ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. యువ ప్రతిభావంతుడిగా గుర్తింపు పొంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. 2026, ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్‌లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో సంగీత భేరీ కార్యక్రమానికి ప్రపంచంలోని 22 దేశాలకు చెందిన సుమారు 2000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు ఒకేసారి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఈ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రత్యేకంగా గుర్తించి ధ్రువపత్రాలు అందజేసింది. వీరిలో కొక్కిరిగడ్డ నీరజ్ కూడా ఒకడు. గిన్నిస్ రికార్డు ప్రతినిధులు అగస్టిన్ దండంగి, జెరుబూబ్బెల్ చేతుల మీదుగా నీరజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు ధ్రువపత్రాన్ని అందుకున్నాడు.
దేశానికి మంచి పేరు తెస్తాను
సంగీతంలో సరికొత్త బాణీలు సృష్టించాలనేదే నా లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా నేను ఎంచుకున్న కీబోర్డు పరికరం ద్వారా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాను. కొత్త ట్యూన్లు కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాను. జాతీయ, అంతర్జాతీయస్థాయి సంగీత పోటీల్లో పాల్గొని మన దేశానికి గుర్తింపు తీసుకురావటానికి కృషి చేస్తున్నాను.
– కొక్కిరిగడ్డ నీరజ్, కీబోర్డు వాయిద్య కళాకారుడు
ఆటల్లోనూ ప్రతిభ
నీరజ్‌కు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టం. రన్నింగ్ బాగా చేసేవాడు. కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్ ఆటల్లో ప్రావీణ్యం సాధించాడు. క్రమంగా ఫెన్సింగ్ ఆటపై ఆసక్తి పెంపొందించుకున్నాడు. కబడ్డీ క్రీడలో పాఠశాల, కళాశాలస్థాయిలో ఆడి ప్రతిభను కనబర్చాడు. కృష్ణా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 17 బాల బాలికల రాష్ట్ర స్థాయి కాడెట్ ఫెన్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. ఆ పోటీలకు జిల్లా ఫెన్సింగ్ ఎన్ఐఎస్ శిక్షకులు విజయ్ గోగులమూడి శిక్షణ ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఏఎస్ఆర్ కళాశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా జట్టుకు నీరజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నీరజ్ తండ్రి స్టాలిన్ కూడా సీనియర్ నేషనల్ షూటింగ్ బాల్ క్రీడాకారుడు కావటం విశేషం.
– యడవల్లి శ్రీనివాసరావు








కామెంట్‌లు (0)