యువతరం ఆలోచించాలి…
దేశాన్ని రక్షించుకోవాలి
ట్రంప్, మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి : బివి రాఘవులు
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ‘యువతే దేశ భవిష్యత్తు. యువత తన ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకుని దేశాన్ని రక్షించుకోవాలి` అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపునిచ్చారు. ట్రంప్, మోడీ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్, మతతత్వ విధానాలపై పోరాడాలని కోరారు. యువతలో అభ్యుదయ, హేతువాద, లౌకిక, సోషలిస్టు భావాలను పెంపొందించడంతో డివైఎఫ్‌ఐ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రావు భవన్‌లో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన యువజన సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేటి యువత దేశం, ప్రపంచ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, అదే సమయంలో పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనలు తెలుపుతోందని ఉదాహరించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఉన్న రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని తప్పుబట్టారు. ప్రపంచమంతా ట్రంప్‌ను తిడుతున్న సందర్భంలో రేవంత్‌రెడ్డి ఆయనను పూజించడం ఏమిటని ప్రశ్నించారు. ఇరాన్‌పై యుద్ధానికి, మన దేశంలో పెట్రోల్, డీజిల్, ఎరువులు ధరలు పెరగడానికి, హార్మూజ్ జలసంధిలో మన నౌకపై దాడి చేసి ముగ్గురు భారతీయుల ప్రాణాలు పోవడానికి కారణమైన ట్రంప్ పేరును హైదరాబాద్‌లోని రోడ్డుకు పెట్టడం ఏంటని నిలదీశారు. భారత ప్రజలకు ఉరితాడు వేస్తోన్న ట్రంప్ పేరును ఆ రోడ్డుకు పెట్టొద్దని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత ఆలోచిస్తోందని తెలిపారు. ఇజ్రాయిల్ ఇంటలిజెన్స్ వ్యవస్థ కోసం గూగుల్ సాంకేతిక వ్యవస్థ పనిచేయడాన్ని తప్పుబడుతూ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గూగుల్ సంస్థ చైర్మన్ సుందర్ పిచ్చాయ్ ప్రసంగాన్ని విద్యార్థులు బాయ్‌కాట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇరాన్ అయిపోగానే క్యూబానే టార్గెట్ అని అమెరికా చెప్పడం దుర్మార్గమన్నారు. క్యూబాకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 50 లక్షల జనాభా ఉన్న క్యూబా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. దివిటిలా ఉన్న క్యూబా తన వెలుతురును మరిన్ని దేశాలకు విస్తరిస్తుందనే భయం అమెరికాను వెన్నాడుతోందన్నారు. సోషల్ మీడియాను అభ్యుదయ శక్తుల కంటే విచ్ఛిన్నకర శక్తులు ఎక్కువ ఉపయోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. యువత మత్తుకు బానిస కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో సైద్ధాంతిక, సాంస్కృతిక పోరాటాలు ఉధృతం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పాంగణాలు, పాఠశాలల్లో కనీస సౌకర్యాల కల్పనకు ఫోకస్ పెట్టి పనిచేయాలని, ఆటలు, పాటల పోటీలను రెగ్యులర్‌గా నిర్వహించాలని డివైఎఫ్‌ఐ శ్రేణులకు పిలుపునిచ్చారు.
డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఎఎ రహీం మాట్లాడుతూ మోడీ సర్కారు అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలతో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, యువత శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకతను ఉపయోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని, నీతి ఆయోగ్ తదితర సంస్థలు ఎత్తిచూపుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉద్యోగ కల్పనలోనూ, పరిశ్రమల ఏర్పాటులోనూ మోడీ సర్కారు విఫలమైందన్నారు. పైగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని, ఉన్న సంస్థల్లోనూ రెగ్యులర్ ఉద్యోగులను కాకుండా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తోందని వివరించారు. పిహెచ్‌డి, బిటెక్ చదివిన వాళ్లు కూడా ఉపాధి అవకాశాల్లేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ వేదికలపై ఉద్యోగాలు చేస్తున్నారని, దేశంలో గిగ్ ఎకనామీ పెరిగిపోతోందని తెలిపారు. గౌరవప్రద జీవితం, భవిష్యత్తు కావాలని యువత పోరాడుతుంటే, ప్రశ్నిస్తుంటే దేశ ద్రోహులు, విదేశీ ఏజెంట్లు అనే ముద్ర వేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు, సంఘ్‌పరివార్ శక్తులు దేశంలో ప్రజలను కులం, మతం, ప్రాంతం పేరుతో విభజించి రాజకీయం చేయడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, డివైఎఫ్‌ఐ నాయకులు. పెద్ద సంఖ్యలో యువతీయువకులు పాల్గొన్నారు. సమావేశానంతరం అనంతరం బాబూ జగ్జీవన్‌రావు భవన్ ఎల్‌బి నగర్ వరకు డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.







కామెంట్‌లు (0)