test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రామ సింహం ఆత్మ ఘోష

1 రోజు క్రితం

The Village Dog's Soulful Cry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 11:23 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

తెల్లవారింది. నేను యధావిధిగా పార్కులోకి వెళ్ళాను.అప్పుడే ఒక అమ్మాయి తన పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చి చెట్టు కింద బెంచీ మీద కూర్చుంది. ఆ పక్కనే ఒక ముసలాయన కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. ఆ కుక్క నన్ను చూడగానే అరవడం మొదలుపెట్టింది. ఒకే జాతి అన్న అభిమానం కూడా ఉండదు వీటికి. పెంపుడు కుక్కలకు వీధుల్లో తిరిగే మమ్మల్ని చూస్తే మొదటి నుంచి చిన్న చూపే. తమను పెంచుకునే యజమానులు ఇంటి దగ్గర తమతో సమానంగా చూసుకుంటూ ఉంటారని, తమకు మాలాగ తిండికి ఇబ్బంది ఉండదనీ వాటికి మమ్మల్ని చూస్తే చులకన భావం. అనైక్యత మనుషుల్లోనే కాదండోయ్, మాలోనూ ఎక్కువే.
ఇంతకీ నేనెవరో పోల్చుకున్నారా? గ్రామ సింహాన్నండి బాబు! ఓహో! అలా అంటే అర్థంకావట్లేదా?వీధుల్లో తిరిగే కుక్కనండి; హమ్మయ్యా! ఇప్పుడు అర్ధమైందనుకుంటాను.
ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ ముసలాయన నన్ను చూస్తూ ” వీధి కుక్కల్ని వీధుల్లో తిరక్కుండా పట్టుకొని ఎక్కడైనా ఒక షెల్టర్ లో ఉంచమని కోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. రేపటి నుంచి మనకి ఈ వీధి కుక్కల బెడద ఉండదు”అన్నాడు.
అతని మాటలకు ఆ అమ్మాయి ” కోర్టు చాలా మంచి తీర్పు ఇచ్చింది. లేకపోతే ఈ వీధి కుక్కలతో చచ్చిపోతున్నామనుకోండి. వీటితో మన పెంపుడు కుక్కలకు గొప్ప ఇబ్బందిగా వుంది” అనీ నా వైపు చూస్తూ చెప్పింది.
ఆమె మాటలు నాకు బాగా బాధను కలిగించాయి. పెంచుకునేందుకు, ఇళ్ల కాపలాకు మేము కావాలి. కానీ మా మానాన మేము వీధుల్లో బతుకుతుంటే మీ మనుషులు తట్టుకోలేరు. మాలో కొన్ని కుక్కలు ఎప్పుడో మీలో కొందర్ని కరిచాయని జనమేజయుడు సర్పయాగం చేసి పాములను నాశనం చేసినట్లు ఏకంగా మాజాతినే లేకుండా చేయాలనుకోవడం మీకు తగునా చెప్పండి? అలాగే మమ్మల్ని షెల్టర్ల లో బంధించి మా స్వేచ్ఛను కాల రాయాలనుకోవడం మంచి పనేనా చెప్పండి? మీకేమో స్వేచ్ఛ కావాలి. మేము మాత్రం బయట స్వేచ్ఛగా తిరక్కూడదు. ఇది ద్వంద్వ ప్రవృత్తి కాదా చెప్పండి? మళ్ళీ ప్రపంచంలో మీ అంత గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు ఉండరని మీ మనుషులంతా విర్రవీగుతుంటారు.
అసలు మా కుక్కల మీద మీ మనుషులకు మొదటి నుంచీ సదభిప్రాయం లేదు. తెల్లారింది మొదలు మా కుక్క నామ జపం చేస్తే గానీ మీకు తెల్లవారదు. కానీ మమ్మల్ని హీనంగా చూస్తూ వుంటారు. ఎవ్వరినైనా తిట్టాలంటే మాపేరే ఉచ్చరిస్తారు. ఎవరినైనా నిందించాలంటే ‘కుక్క బుద్ధి’ అంటారు. మీకు జీవితం మీద విసుగు పుడితే ‘కుక్క బతుకు’ అనీ బాధపడతారు. మీలో మీరు కొట్టుకున్నా ‘కుక్కల కొట్లాట’ అనీ అప్పుడు కూడా మా పేరునే ఉపయోగిస్తారు. మీకిష్టం లేనివాళ్లను ‘కుక్క మూతి పిందెలు’ అనీ మా పేరుతో ఎద్దేవా చేస్తారు. మీ శత్రువుకి తగిన శాస్తి జరిగినప్పుడు ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’అనీ దెప్పి పొడుస్తారు. మీకిష్టం లేని వాళ్ళు ఏదైనా హడావిడి చేస్తే ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అనీ వెక్కిరిస్తారు. అలాగే మీకిష్టం లేనివాళ్లకు మంచి పదవి దొరికితే ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టారు’ అనీ మా పేరుతో ఎద్దేవా చేస్తారు. ఏం మేము కనకపు సింహాసనం మీద కూర్చోడానికి అర్హులంకామా? ఆ మాట కొస్తే ఇప్పుడు పాలిస్తున్న చాలా మంది రాజకీయ నాయకుల కన్నా మేము బాగా పరిపాలించగలము. అలాగే మీ శత్రువు అనాధగా చనిపోతే ‘కుక్క చావు’ చచ్చాడనీ మా పేరుని మీ పగలకు, కక్షలకు కూడా వాడుకుంటారు. ఇలా ప్రతీ దానికి మాపేరును వాడుకుంటూ, మా చేత నానారకాల పనులు చేయించుకుంటూ మళ్ళీ మమ్మల్నే ఆడిపోసుకుంటూ ఉంటారు. ఇది న్యాయమా చెప్పండి ?
మీ మానవుల కన్నా మేమే ముందు అడవుల్లో ఉండేవాళ్ళమట. అలా మా మానాన మేము ఎక్కడో బతుకుతుంటే మీ మనుషులే మమ్మల్ని మీరు నివసించే ప్రాంతాలకు, గ్రామాలకూ తెచ్చుకునీ మమ్మల్ని మచ్చిక చేసుకున్నారట. ఈ విషయం ఈ మధ్యనే నాకు తెలిసింది. అలా మీ మనుషులు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు మా కుక్కే. అప్పటి నుంచి మీకు మేము వేటలో సహాయం చేస్తూ వచ్చాము. ఆ తరువాత మీ ఇళ్ళు, పొలాలు, పంటల కాపలాకు మమ్మల్ని ఇష్టానుసారం వాడుకున్నారు. అలాగే దొంగలను, హంతకులను పట్టుకునేందుకు, బాంబులను తనిఖీ చేసేందుకు మేము మీకెంతగానో సహాయం చేసాము. దేవదాసు లాంటి ఒంటరి తాగుబోతులకు అండగా నిలబడ్డాము. అలాగే అంతరిక్షంలోకి కూడా మీకన్నా మా కుక్క ‘లైకా’ యే ముందు వెళ్ళింది. అది కూడా మాస్కో వీధుల్లో తిరిగే నాలాంటి ఊరకుక్కే. అందుకే మాకు మీ మనుషులే ‘గ్రామ సింహం’ అన్న గొప్ప బిరుదు కూడా ఇచ్చారన్న విషయం మరిచిపోకండి.
మీరెంతో ఇష్టపడే మీ మహాభారతం కూడా మా కుక్కతోనే మొదలై మా కుక్కతోనే ముగుస్తుందని మీకు తెలుసా? మహాభారతం ప్రారంభంలో జనమేజయుడు సర్పయాగం చేసే సమయంలో ఒక కుక్క యాగం దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ అమాయక జీవిని జనమేజయ సోదరులు వెంబడించి విచక్షణారహితంగా కొడతారు. అప్పుడు ఆ కుక్క తల్లి తన కొడుకుకి జరిగిన అన్యాయానికి జనమేజయుడుని ప్రశ్నిస్తుంది. అతనికి ఎదురు తిరుగుతుంది. ఆ తరువాత అతన్ని శపిస్తుంది. ఆ విధంగా ప్రతి జీవికి వారి హోదాతో సంబంధం లేకుండా అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు ఉంటుందని మహాభారతంలో మా కుక్క చేసే పోరాటం ద్వారా ప్రజలకు తెలిసింది.
ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెప్పడం మరిచిపోయాను. మీ పాండవాగ్రజుడు ధర్మరాజుతో పాటు స్వర్గానికి వెళ్లిన గొప్ప చరిత్ర మాకుంది. మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు తన సోదరులను, భార్య ద్రౌపదిని కోల్పోయి తాను, మా కుక్క మాత్రమే మిగిలి ఉంటారు. ఆ తరువాత వారు కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అప్పుడు ఇంద్రుడు తన రథంలో వచ్చి, యుధిష్ఠిరుడి అసాధారణ లక్షణాలను ప్రశంసించి, స్వర్గానికి రమ్మనమని రథంలోకి ఆహ్వానిస్తాడు. అప్పుడు ధర్మరాజు “నాతో పాటు వచ్చిన ఈ కుక్క కూడా స్వర్గానికి వస్తుంది ” అనీ అంటాడు.
అప్పుడు ఇంద్రుడు”అది సాధ్యం కాదు, అందరూ స్వర్గాన్ని పొందలేరు. కుక్క జంతువు. దానికి ఆ అర్హత లేదు” అనీ అంటాడు.
“అలా అయితే నాకు స్వర్గం అక్కర్లేదు. ఆ కుక్క నా నమ్మకమైన సహచరుడు. నేను దానిని విడిచి పెట్టలేను. అది నా సహాయం కోరింది. నా తోడుగా నా వెన్నంటే వుంది. దాని దుఃఖంతో పోలిస్తే స్వర్గపు సుఖాలు నాకు ఎక్కువ కావు. ఆమెకు నా భార్య, సోదరుల బలహీనతలలో ఏదీ లేదు. దానికి స్వర్గానికి వెళ్ళే అర్హత లేకపోతే నాక్కూడా ఉండదు” అనీ ధర్మరాజు వెళ్లిపోతుంటే “యుధిష్ఠిరా ఆగు! ఆ కుక్క ధర్మం, దాని నుండే నువ్వు వచ్చావు” అంటాడు. అప్పుడు ఆ కుక్క ధర్మ దేవతగా మారి ధర్మరాజుని ఆశీర్వదిస్తుంది. అప్పుడు యుధిష్ఠిరుడు ఇంద్రుని రథంలో స్వర్గానికి వెళతాడు. కాబట్టి మాకు గొప్ప చరిత్ర ఉందని ఇప్పటికైనా ఒప్పుకుంటారా ?
​అలాగే నమ్మకంలో మాకు సాటి ఎవ్వరూ రారు. అందుకు ఉదాహరణ జపాన్ కి చెందిన ‘హచికో’ అనే మా కుక్క. ఆ కుక్కను ఒక ప్రొఫెసర్ గారు పెంచుకున్నారు. అతను ప్రతీరోజూ సాయంత్రం విశ్వ విద్యాలయం నుంచి రైల్వేస్టేషన్ కి వచ్చేవారు. అతని కోసం అతని పెంపుడు కుక్క‘హచికో’ రోజూ రైల్వే స్టేషన్లో ఎదురుచూస్తుండేది. ఒకరోజు అతను విశ్వ విద్యాలయంలోనే గుండెపోటుతో చనిపోయాడు. ఆ సంగతి తెలియని ‘హచికో’ యజమాని కోసం ప్రతీ రోజులాగే స్టేషన్ కి వచ్చింది. అతను రాలేదు. మర్నాడు కూడా వచ్చింది. అలా పది సంవత్సరాలపాటు అది చనిపోయే వరకూ క్రమం తప్పకుండా ఆ స్టేషన్ కి వస్తూ యజమాని కోసం ఎదురుచూసింది. అందుకే జపాన్లో ‘హచికో’ కుక్క ఒక సాంస్కృతిక చిహ్నం. ‘హచికో’ కుక్క వల్లే ఐడియా ఫోను కుక్కకు ‘హచ్’ అన్న పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అదీ మా విశ్వాసం అంటే. కుక్క అంటే విశ్వాసం అనే పేరు మాకు ఉత్తినే రాలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము సాధించుకున్న గొప్ప ఘనత అది.


The Village Dog's Soulful Cry


ఇంకా చెప్పాలంటే మాకు ఎన్నో గొప్ప కథలున్నాయి. అవి కూడా చెబుతాను వినండి. ఒక కుక్క నది దాటుతుండగా, నీటిలో తన ప్రతిబింబం చూస్తుంది. ఆ ప్రతిబింబంలో ఉన్న కుక్క నోటిలో పెద్ద ఎముక ఉందని భావించి, తన నోటిలోని ఎముకను వదిలేసి, నీటిలోని ఎముక కోసం దూకుతుంది; కానీ అది దాని ప్రతిబింబం మాత్రమే అని తెలుసుకుంటుంది. ఇది అత్యాశకు సంబంధించిన నీతి కథ. అలాగే ఒక కుక్క తన పిల్లలతో కలిసి జీవిస్తూ, వాటికి మంచి అలవాట్లు నేర్పుతుంది. ఒకరోజు, కుక్కపిల్లలు బావిలో పడబోతే, తల్లి కుక్క వారిని రక్షిస్తుంది. ఇది తల్లి ప్రేమకు, బాధ్యతకు సంబంధించిన నీతికథ.
మనిషితో కలిసి జీవించడం నేర్చుకున్న మొదటి జంతువులు మా కుక్కలే. మేము చాల నమ్మకమైన జంతువులం. విధేయత మా ఆభరణం. కొన్నిప్రాంతాల్లో మా కుక్కలను దైవంగా భావిస్తారు. ప్రపంచంలో మా కుక్కలు మూడు వందల రకాలున్నాయి అనీ అంటారు. మాలో మళ్ళీ పెంపుడు కుక్కలు, ఊర కుక్కలనీ రెండు రకాలున్నాయి. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు కానీ మనిషి కుక్కను కరిస్తే వార్త అనీ జర్నలిజంలో చెబుతారు. మేము అనవసరంగా ఎవ్వరినీ కరవము. మాకు హాని చేస్తేనే ఆ పని చేస్తాము.
కానీ మీ మనుషులు కులాలు, మతాల పేరిట కారణం లేకుండానే చంపేస్తూ నర మేధానికి పాల్పడుతుంటారు. ఇది మీ మానవ ప్రవృత్తిని తెలియజేస్తుంది. కానీ మేము మీలాగా కాదు. ఈ దేశంలో ఆరుకోట్ల ఊర కుక్కలం వున్నాము. మా వల్ల మీకే నష్టం లేదు సరికదా మీకు అన్ని విధాలా ఉపయోగపడుతున్నాము. అటువంటిది ఏవో కొన్ని కుక్కలు మిమ్మల్ని, మీ పిల్లల్ని కరిచాయన్న కారణంతో మమ్మల్ని లేకుండా చేయాలనుకోవడం తప్పు కాదా చెప్పండి? ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు కోట్ల జీవులున్నాయి. అందులో మీరు, మేము కూడా వున్నాము. మనందరం కలిస్తేనే ఈ ప్రపంచం. మనుషులు, పక్షులు, మాలాంటి జంతువులు, చెట్లు, చేమలు, అడవులు అన్నీ కలిసి ఉంటేనే ప్రకృతి సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి సామాన్యుడు దాకా మమ్మల్ని చాల మంది ప్రేమిస్తున్నారు. అటువంటిది మమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవడం మంచిదేనా చెప్పండి? కాబట్టి మమ్మల్ని ఎప్పటిలాగే ప్రేమించండి. మమ్మల్ని దూరం చేసుకోకండి. మన అనుబంధం ఇప్పటిది కాదని, ఎప్పటినుంచో ఉందని గుర్తుకు తెచ్చుకోండి.
నేను ఇలా ఆలోచిస్తున్న సమయంలో దూరంగా ఒక వేన్ వస్తూ కనిపించింది. దాన్ని చూడగానే నాకు భయం వేసింది. బహుశా అది మా వీధి కుక్కల్ని పట్టుకొని తీసుకుపోయే కుక్కల వేన్ లా వుంది. వుండడమేమిటి, అది మా కుక్కల వ్యానే. అంటే ప్రభుత్వం అప్పుడే మమ్మల్ని ఏరివేసే ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నమాట. ఇంక ఇక్కడ ఉంటే నన్ను కూడా తీసికెళ్ళిపోయి ఎక్కడో షెల్టర్లలో పడేస్తారు. అక్కడ ఉంటే నరకంలో వున్నట్లే ఉంటుంది. కాబట్టి నేను ఏ కాకులు దూరని కారడవికో పారిపోతే మంచిది. అక్కడైతే మీ మనుషుల బాధ తప్పుతుంది. ఇన్నాళ్లు అనవసరంగా మీ మనుషులని నమ్ముకున్నాము మేము. మనుషులు అందరి కన్నా చాలా స్వార్ధపరులనీ ఆ మధ్యన పార్కులో ఎవరో చెప్పుకుంటూ ఉంటే విన్నాను. అవసరం తీరిపోతే తెప్ప తగలేసే రకం మీ మనుషులు. ‘కుక్క తోక పట్టుకొని గోదారి ఈదితే ప్రమాదం’ అనీ మమ్మల్ని ఉద్దేశించి అంటారు కానీ ఆ సామెత మీ మనుషులకి సరిగ్గా సరిపోతుంది. మిమ్మల్ని నమ్ముకుంటే నరకానికి వెళ్ళవలసిందే. ఆ ఆలోచన రాగానే వెంటనే పరుగు లంఘించుకున్నాను. ఇంక కారడవి కనిపించేదాకా నా పరుగు ఆగదు.


గన్నవరపు నరసింహమూర్తి
ఫోన్ : 7752020123


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్